Thursday, April 28, 2011

అమెరికాలో టోర్నడోల బీభత్సం: అలబామాలో 128 మంది మృత్యువాత

వాషింగ్టన్,ఏప్రిల్ 29: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టోర్నడోలకు మెరుపు వరదలు తోడై అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే భవనాలు నేలమట్టం కాగా, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. బుధవారం ఒక్క రోజే అలబామాలో 128 మంది మృత్యువాత పడ్డారు. అలబామా యూనివర్సిటీ ఉన్న టస్కలూసా నగరంలో వరదలు వీధి వీధినీ తుడిచిపెట్టాయని మేయర్ వాల్టర్ మడాక్స్  తెలిపారు. అలబామా గవర్నర్ రాబర్ట్ బ్రాంట్లీ విలేకరులతో మాట్లాడుతూ ‘తుపానుల ధాటికి రాష్ట్రం బాగా నష్టపోయింది. రాష్ట్రానికి ఇంకా టోర్నడోల ముప్పు తొలగిపోలేదు’ అని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో టోర్నడోలకు బలైన వారి సంఖ్య 246కి చేరింది.  తీవ్రంగా నష్టపోయిన అలబామా రాష్ట్రానికి గాలింపు, సహాయక బృందాలను పంపుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు. కాగా, అలబామా, జార్జియా, మిసిసిపీలోని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన టోర్నడోలు, వడగళ్ల వాన, మెరుపు వరదలు సంభవించే అవకాశముందని, ప్రమాదకరమైన పిడుగులు కూడా పడొచ్చని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గ్రేట్ లేక్స్ నుంచి దిగువన ఉన్న గల్ఫ్ కోస్ట్ వరకు మరో 21 రాష్ట్రాల్లోనూ టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముందని తెలిపింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...