Saturday, April 23, 2011

నరేంద్ర మోడీని వీడని ' గోద్రా ' ...!

అహ్మదాబాద్,ఏప్రిల్ 23:  ‘గోద్రానంతర అల్లర్లు’  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వెంటాడుతూనే ఉన్నాయి. అల్లర్లకు పాల్పడుతున్న హిందువులను.. వారి ఆగ్రహం చల్లారేవరకు.. చూసీచూడనట్లు వదిలేయాలని పోలీసు అధికారులకు మోడీ ఆదేశాలిచ్చారని పేర్కొంటూ.. అల్లర్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఒక కీలక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ముస్లింలకు గుణపాఠం నేర్పాలని మోడీ అభిప్రాయపడ్డట్లు అందులో భట్ ఆరోపించారు. జాకియా జఫ్రీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 14న సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆ అఫిడవిట్‌లోని వివరాలను భట్ సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. 2002లో, గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను దగ్ధం చేసిన ఘటనలో 59 మంది కరసేవకులు మరణించడంతో.. గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగి దాదాపు వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి మారణహోమం సమయంలో సంజీవ్ భట్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీసీపీగా విధుల్లో ఉన్నారు. అల్లర్ల సమయంలో 2002 ఫిబ్రవరి 27న మోడీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
డీసీపీ హోదాలో సంజీవ్ భట్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందువులతో సున్నితంగా వ్యవహరించాలని ఆ సమావేశంలో మోడీ పోలీసు అధికారులకు సూచించారని భట్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే, ఆ అఫిడవిట్లోని వివరాలను వెల్లడించేందుకు సంజీవ్ భట్ నిరాకరించారు. అందులోని అంశాలు మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కాకుండా నేరుగా సుప్రీంకు అఫిడవిట్‌ను సంజీవ్ భట్ సమర్పించారు. ఇందుకు గల కారణాలను అఫిడవిట్‌లో వివరించానని భట్ తెలిపారు. ‘ఇంటెలిజెన్స్ బ్యూరోలో అధికారిగా ఉండటం వల్ల నాకా విషయాలు తెలిశాయి. ఆ వివరాలను వెల్లడించడం వృత్తిపరంగా సరికాదు.. అయితే, చట్టపరమైన బాధ్యత ఉన్నప్పుడు వెల్లడించక తప్పదు’ అన్నారు. గతనెలలో భట్‌ను కూడా మూడురోజుల పాటు సిట్ విచారించింది. ఫిబ్రవరి 27 నాటి సమావేశంలో పాల్గొన్న ఇతరులు.. భట్ ఆ సమావేశంలో పాల్గొనలేదని పేర్కొనడాన్ని ప్రస్తావించగా.. తననెవరు ఆ సమావేశానికి వెళ్లమన్నది, ఎవరితో కలిసి తాను ఆ సమావేశానికి వెళ్లిందీ.. తన అఫిడవిట్‌లో సమగ్రంగా వివరించానన్నారు. ‘సిట్, సుప్రీంకోర్టులు వాస్తవాలు కావాలనుకుంటే.. అవి నా అఫిడవిట్‌లో లభిస్తాయి’ అన్నారు. సంజీవ్ భట్ ప్రస్తుతం రాష్ట్ర రిజర్వ్ పోలీస్ శిక్షణాకేంద్ర ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గోద్రానంతర అల్లర్ల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జఫ్రీని, ఆయన ఇంట్లోనే ఆందోళనకారులు సజీవ దహనం చేశారు. దాంతో ఆయన భార్య జాకియా జఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, పోలీసు ఉన్నతాధికారులు సహా 63 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. కోర్టు ఆ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. కాగా 2002, ఫిబ్రవరి 27 నాటి సమావేశానికి సంజీవ్ భట్ హాజరు కాలేదని సిట్‌కిచ్చిన వాంగ్మూలంలో నరేంద్ర మోడీ స్పష్టంచేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...