Sunday, April 24, 2011

సత్య సాయిబాబా అస్తమయం...

పుట్టపర్తి,ఏప్రిల్ 24: భగవాన్ సత్యసాయి బాబా (86)  తుదిశ్వాస విడిచారు.ఆదివారం   ఉదయం 7.40 నిమిషాలకు సత్యసాయి బాబా దేహాన్ని చాలించినట్టు  సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్  ప్రకటించింది.   28 రోజుల పాటు  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొంందిన  బాబా ఈ రోజు  కార్డియోవాస్కులర్ ఫెయిల్యూర్‌తో మరణించినట్టు ట్రస్ట్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. దేశ విదేశాలలోని బాబా భక్తులు తీవ్ర విచారానికి లోనయ్యారు. బాబా భౌతిక కాయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో ఉంచారు. ఆదివారం  సాయంత్రం నుంచి బాబా కడసారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. బాబా భౌతిక కాయాన్నిరెండు రోజుల పాటు సాయి కుల్వంత్ మందిరంలోవుంచిన అనంతరం 27వ తేదీన అక్కడే అధికార లాంచనాలతో సమాధి చేస్తారు.  బాబా అంత్యక్రియలు  జరిగే ఏప్రిల్ 27 తేదిన అనంతపురం జిల్లాకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వరకు 4 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.  సత్యసాయి బాబా మరణ వార్త వెలువడగానే  ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పుట్టపర్తి చేరుకుని  బాబా పార్థీవ శరీరాన్ని సందర్సించి నివాళులు అర్పించారు.  ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కడప నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. . బెంగళూరులో ఉన్న పీఆర్పీ అధినేత చిరంజీవి బాబా మరణవార్త వినగానే పుట్టపర్తికి బయలుదేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.  ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి, ప్రధాని మన్మోహన్, సీనియర్ బీజేపీ నాయకులు అద్వానీ, వివిధ  రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు బాబా మృతి పట్ల సంతాపం తెలిపారు.
        అనంతపురం జిల్లా పుట్టపర్తిలో  1926 నవంబర్ 23న బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక మార్గం పట్టిన బాబా ప్రేమతత్వాన్ని బోధించారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన బాబా ప్రపంచ మానవాళిని ప్రభావితం చేశారు. కేవలం ఆధ్యాత్మిక బోధనలకే పరిమితం కాకుండా విస్త్రుతంగా  సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య, వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. పలు జిల్లాల్లో వందలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. 2009 ఒడిశాలో వరద బాధితులకు 699 ఇళ్లు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తన ట్రస్ట్ ద్వారా బాబా సేవలందిస్తున్నారు. బాబా సేవలకు గుర్తింపుగా 1999 నవంబర్ 23న ప్రభుత్వం తపాల బిళ్ల విడుదల చేసింది.   



1 comment:

Unknown said...

he died at 7.40 am as per declaration. pl note

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...