Saturday, April 30, 2011

జాడ లేని అరుణాచల్ సి.ఎం.

ఇటానగర్,మే 1 : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో తప్పిపోయిన దీని ఆచూకీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెలియరాలేదు. దీంతో అటు రాష్ట్రంలో, ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హెలికాప్టర్ కోసం భద్రతాబలగాలు సాయంత్రం వరకు ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. పవన్ హన్స్ సంస్థకు చెందిన ‘ఏస్ 350 యూరోకాప్టర్ బీ-3’ అనే ఈ హెలికాప్టర్ శనివారం ఉదయం 9.56 గంటలకు తవాంగ్ నుంచి టేకాఫ్ తీసుకుంది.
ఉదయం 11.30 గంటలకు ఇది తవాంగ్‌కు 200 కి.మీ దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో గల్లంతైంది. నాలుగు నెలల క్రితమే తయారైన ఈ హెలికాప్టర్‌లో ఖాండుతోపాటు ఆయన భద్రతాధికారి యేషి చోద్దాక్, తవాంగ్ ఎమ్మెల్యే సేవాంగ్ ధోండప్ సోదరి యేషి లామూ, హెలికాప్టర్ సిబ్బంది కెప్టెన్ జేఎస్ బబ్బర్, కెప్టెన్ కేఎస్ మాలిక్‌లు ఉన్నారు. బీ-3 టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత చైనా సరిహద్దులోని సెలా పాస్ వద్ద ప్రయాణిస్తుండగా దానితో కంట్రోల్ రూమ్‌కు సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ మధ్యాహ్నం భూటాన్ సరిహద్దులోని ఎగువ సబాన్సిరి జిల్లా దాపోరిజో ప్రాంతంలో సురక్షితంగా దిగిందని, అక్కడి నుంచి గువాహటికి వస్తోందని వార్తలు వచ్చాయి. రక్షణశాఖ ప్రతినిధి, లెఫ్టినెంట్ గవర్నర్ జేజే సింగ్‌లు కూడా ఈమేరకు ప్రకటనలు చేశారు. అయితే హెలికాప్టర్ ఆచూకీ ఇంకా తెలియలేదని రాష్ట్రప్రభుత్వం, సీఎం కార్యాలయం, భూటాన్ ప్రభుత్వం సాయంత్రం వెల్లడించాయి. గాలింపు ఇంకా కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై ఢిల్లీలో తెలిపారు. బీ-3 గల్లంతైనట్లుగా భావిస్తున్న సెలా పాస్ వద్దకు సహాయక బృందాలను పంపామన్నారు. ఆదివారం ఉదయం ఆర్మీ, వాయుసేన, రాష్ట్ర పోలీసు బలగాలు వాయు, భూ మార్గాల్లో గాలింపు జరుపుతాయని అరుణాచల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాబిన్ హిబూ తెలిపారు. ఈశాన్య భారత్‌లో గత పక్షం రోజుల్లో హెలికాప్టర్ గల్లంతవడం ఇది మూడోసారి. ఈ నెల 19న పవన్ హన్స్‌కే చెందిన హెలికాప్టర్ తవాంగ్ కొండల్లో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది మృతిచెందారు. ఆర్మీకి చెందిన ఇంకో హెలికాప్టర్ గాంగ్‌టక్‌లో కూలిపోవడంతో నలుగురు చనిపోయారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...