Friday, April 29, 2011

కె.బాలచందర్ కు దాదాసాహేబ్ పాల్కే అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:  2010 సంవత్సరానికి దాదాసాహేబ్ పాల్కే అవార్డుకు ప్రముఖ దక్షిణ భారత సినిమా దర్శకుడు, రచయిత,  నిర్మాత. కె.బాలచందర్ ఎంపికయ్యారు. తెలుగులో ఆయన సత్తెకాలపు సత్తెయ్య, గుప్పెడు మనసు, మరోచరిత్ర, అంతులేని కథ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించారు. గత 45 ఏళ్లుగా ఆయన సినీ రంగంలో ఉన్నారు.  దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరెన్నిక గన్నారు. ఆయన తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వ, నిర్మాణ, రచయిత బాధ్యతలు నిర్వహించారు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. లోతైన వ్యక్తిగత సంబంధాలను, సామాజిక అంశాలను ఆధారం చేసుకుని ఆయన సినిమాలు చేశారు.   నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు.  ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది. ఆయన తమిళంలో తీసిన పలు సినిమాలు తెలుగులో వచ్చాయి.  ఆయనకు 1987లో పద్మశ్రీ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనను 1973లో కలైమమణి బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, రుద్రవీణ, తొలి కోడి కూసింది వంటి ఆయన తెలుగు చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి. అక్కినేని జాతీయ అవార్డు కూడా ఆయనకు లభించింది. రజనీకాంత్, కమల హాసన్‌లను నటులుగా తీర్చిదిద్దింది బాలచందరే. వారిద్దరు ఆయనను తమ గురువుగా గౌరవిస్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...