Sunday, April 10, 2011

బాబు కు బామ్మరుదుల పోటు...!

హైదరాబాద్, ఏప్రిల్ 10:  తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ  విడుదల చేసిన బహిరంగ లేఖ పార్టీలో కలకలం రేపింది. మొదలైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన దీక్షకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేపట్టి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్నపుడే.. అవినీతిపై పోరాటానికి త్వరలో జనం ముందుకు వస్తానంటూ హరికృష్ణ రాసిన లేఖ ప్రతులను ఆయన అనుచరులు బహిరంగంగా పంపిణీ చేశారు. హరికృష్ణ  తన లేఖలో కుంట భూమిలేని వారు రాజకీయాల్లోకి వచ్చి సంపాదిస్తున్నారంటూ చేసిన ప్రస్తావన పార్టీ అధినేత ను ఉద్దేశించినవేనని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దిరోజులుగా చంద్రబాబు, హరికృష్ణ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.చంద్రబాబు ' మీకోసం ' యాత్ర నిర్వహించినపుడు, ఆ తర్వాత పార్టీలో అన్నీ తానై వ్యవహరించినా కరివేపాకు లాగా తనను వాడుకుని వదిలేయటం పట్ల అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ తన నిరసనను ఏదో ఒక రూపంలో కొద్ది రోజులుగా బయటపెడుతున్నారు. దీనికి హరికృష్ణ సోదరి, కేంద్రమంత్రి పురందేశ్వరితో పాటు, ఆయన కుమారుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ల సహకారం లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన  సమయంలో.. నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందనే వాదాన్ని చంద్రబాబు తెరపైకి తెస్తే.. ఇప్పుడు హరికృష్ణ అనుచరులు ఎన్‌టీఆర్ కుటుంబానికి అవమానం అనే నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని.. దీనినిబట్టి పార్టీలో కుటుంబ కలహాలు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో తన పర్యటన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరించిన తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ తన అనుచరులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వల్లభనేని వంశీమోహన్‌ల ద్వారా దాన్ని వ్యక్తపరిచారు. ఈ పరిణామాలు చంద్రబాబును ఇరుకునపెట్టాయి. చంద్రబాబు వాటి పై పత్రికా ప్రకటన విడుదల చేయటంతో పాటు విలేకరులతో మాట్లాడిన సమయంలో ఎవరిని ఏ స్థాయిలో చూడాలో తనకు బాగా తెలుసంటూ ఒకరకంగా హరికృష్ణపై బెదిరింపు ధోరణితో వ్యక్తం చేశారు.  సింగపూర్ పర్యటనలో ఉన్న తాను  జూనియర్ ఎన్‌టీఆర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని.. ఎంటీఆర్  కుటుంబానికి  తాను ఎంతో చేశానని, ఎప్పుడూ హరి  వెన్నంటి ఉండే వంశీకి విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వటంతో పాటు పెద్ద మొత్తంలో ఆర్థికసాయం చేశానని లీక్ చేయటం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని హరికృష్ణ ఆగ్రహంతో ఉన్నారు.   కాగా, మరో బామ్మరిది,వియ్యంకుడు   బాలయ్య బాబు కూడా  పార్టీలో నెలకొన్న వివాదాల్లోకి  తనను లాగవద్దంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడం  చంద్రబాబు కు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. 




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...