'శ్రీకృష్ణ’ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్,డిసెంబర్ 29: రాష్ట్రం లో పరిస్థితుల అధ్యయనానికి ఏర్పాతైన   శ్రీకృష్ణ కమిటీ గురువారం లేదా శుక్రవారం కేంద్రానికి నివేదిక సమర్పించనున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  నివేదిక ఎలా వుంటుందనే అంశం పై  అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ  చర్చ జరుగుతోంది. మరో వైపు   శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం  ఉందన్న నిఘా నివేదికల నేపథ్యంలో  పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. కేంద్రం నుంచి ఇప్పటికే వచ్చిన 50 కంపెనీల అదనపు బలగాలకు తోడు అదనంగా మరో 50 కంపెనీలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలు పంపింది. ముందస్తు జాగ్రత్త చర్యలపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ కె.అరవిందరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రె డ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఏకే ఖాన్, ఎస్.ప్రభాకర్‌రెడ్డిలతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. అదనపు బలగాలపై అపోహలకు గురికావద్దని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే వాటిని రప్పిస్తున్నట్టు మీడియాకు చెప్పారు.   ఏడాది కాలంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తున్నాం. మన బలగాల సంఖ్య చాలనందుకే కేంద్రం నుంచి అదనపు బలగాలను కోరాం. తెలంగాణతో పాటు సీమాంధ్ర జిల్లాలకు కూడా వాటిని తరలిస్తున్నాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఉపద్రవం వస్తుందని, ఏదో జరుగుతుందనే ప్రచారాలను నమ్మవద్దు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పార్టీలు, విద్యార్థులు, మీడియా సహకరించాలి’’ అని కోరారు.  కాగా, నివేదిక, అనంతరం తలెత్తబోయే పరిణామాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో సుదీర్ఘంగా చర్చించారు! రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదికకు సంబంధించిన వార్తల కవరేజీలో మీడియా సంయమనం పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అంబికా సోని కోరారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు