Thursday, December 30, 2010

ఆంధ్రప్రదేశ్ కు 1,001 టీఎంసీల కృష్ణా జలాలు

న్యూఢిల్లీ,డిసెంబర్ 30:  కృష్ణా జలాల పంపిణీపై ఆరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్  1,001 టీఎంసీలు వాడుకోవచ్చని కృష్ణా ట్రిబ్యునల్  తీర్పునిచ్చింది. అలాగే మహారాష్ట్ర 666 టీఎంసీలు, కర్ణాటక 911 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఆదేశించింది.కాగా మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి  ఎదురు దెబ్బ తగిలింది. గతంలో మిగులు జలాలను వాడుకునే హక్కు మన రాష్ట్రానికి మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.అలాగే తాగునీటి అవసరాల కోసం చెన్నైకి మూడు రాష్ట్రాలు సమానంగా నీటిని ఇవ్వాలని టిబ్యునల్ పేర్కొంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఒక్కో రాష్ట్రం 3.3 టీఎంసీలు, జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో 7 టీఎంసీల చొప్పున నీటిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆల్మటి ఎత్తును 524.25 వరకూ పెంచుకోవచ్చని కృష్ణా ట్రిబ్యునల్  అనుమతి ఇచ్చింది. కాగా కృష్ణా టిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు వంటిదని టీడీపీ నేత కడియం శ్రీహరి అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. కృష్ణా, డెల్టాకు ఈ తీర్పు తీరని నష్టమని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ తీర్పుతో కర్ణాటక లాభపడిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ట్రిబ్యునల్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...