Thursday, September 6, 2012

వర్షాల వల్ల 48వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్,సెప్టెంబర్  6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 48,690 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక సర్వేలో తేలిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్కువగా వరి పంట 39,915 ఎకరాల్లో, పత్తి 8,250 ఎకరాల్లో నీట మునిగిందని చెప్పారు. 235 ఎకరాల్లో మొక్కజొన్న, 290 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 25,262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 12,560 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 3,012 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,357 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,490 ఎకరాలు , నిజామాబాద్ జిల్లాలో 1,182 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 200 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయన్నారు.
ప్రాజెక్టులకు జలకళ....
ఇలాఉండగా,  భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ధాటికి ప్రియదర్శిని జూరాల పూర్తిగా నిండింది. ఎగువనున్న ఆలమట్టి, నారాయణపూర్ నిండటంతో ప్రాజెక్టుకు ఏకంగా 1.53 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో 19 గేట్లను రెండు మీటర్ల దాకా ఎత్తి 1.85 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు  కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద నీరు భారీగా వస్తోంది.   శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 7,500 క్యూసెక్కుల విడుదలకు రంగం సిద్ధమైంది. నాగార్జునసాగర్‌కు మాత్రం ఇప్పటికి 29,005 క్యూసెక్కులే వదిలారు. సాగర్ నీటిమట్టం 510.4 అడుగులకే పరిమితం అయింది. పూర్తి సామర్థ్యం 408 టీఎంసీ కాగా 132 టీఎంసీ మాత్రమే ఉంది. మరోవైపు గోదావరి  ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది.  ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి గోదావరి 44 అడుగుల నీటిమట్టంతో నిలకడగా ప్రవహిస్తోంది.  మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు నదిలోకి వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దా గోదారి పరవళ్లు తొక్కుతోంది. వరద 8,95,946 క్యూసెక్కులకు చేరింది. నీటిమట్టం 10.70 అడుగులకు చేరింది. కాగా, ప్రకాశం బ్యారేజీకి మూడు రోజులుగా వస్తున్న వరద గురువారం తగ్గుముఖం పట్టింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...