Wednesday, September 12, 2012

మూడు ముక్కలాట...!!

హైదరాబాద్, సెప్టెంబర్ 12:  రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట సాగుతోంది. చిరంజీవి, బొత్స, కిరణ్ ఎవరికి వారే 'ముఖ్యమంత్రి ' పదవి కోసం ఎవరికి వారు సొంత ఎజెండాతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి విషయానికి వస్తే ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకులను, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని వ్యూహాత్మకంగా కలుపుకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. సేవ్ కాంగ్రెసు పేరిట రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు కార్యక్రమానికి ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ చిరంజీవి హాజరయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైన కొత్తలో బొత్స, చిరంజీవి భుజాలు భుజాలు  రాసుకు  తిరిగారు. అయితే ఆ తరువాత ! చిరు క్రమంగా ముఖ్యమంత్రి కిరణ్‌కు దగ్గరయినట్లుగా కనిపించారు.  ఇప్పుడు ఇద్దరికీ సమాన దూరం పాటిస్తూ.. వారి పని తీరుపై పార్టీ అధిష్టానానికి సైతం చిరంజీవి ఫిర్యాదులు చేసినట్టుగా చెబుతున్నారు. తాజగా  సేవ్ కాంగ్రెసు సదస్సులో చిరంజీవి స్వంత పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెసు ఇల్లు భద్రంగా ఉంటుందని తాను భావించానని, కానీ ఈ భవనం బీటలు వారి, పైకప్పు చెల్లా చెదురై తనలో అభద్రతా భావం నెలకొల్పుతోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాఖ్యలకు బొత్స కూడా పరోక్షంగా ఘాటుసమాధానమిచ్చారు. కాంగ్రెసును పునాదులతో పెకిలిస్తామని ప్రకటించిన నాయకులు ఆ తర్వాత కనుమరుగై ఆ తర్వాత కాంగ్రెసులోనే విలీనమయ్యారని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే  బొత్స వ్యాఖ్యానించారు. దీనితో చిరంజీవి, బొత్స  మధ్య ఉన్న విభేదాలు  బహిర్గతం అయ్యాయి. ఇటు సి.ఎం. కిరణ్   వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందని అంటున్నారు.  మంత్రులతో చర్చించడంతో పాటు నేతలతో టచ్‌లో ఉంటున్నారట. అదే సమయంలో ప్రజల్లోకి కూడా వెడుతున్నారు. అటు బొత్స కూడా పార్టీ నేతలతో భేటీలు జరుపుతూ, జిల్లా పర్యటనలు చేస్తున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...