మళ్ళీ ఆర్టీసి వడ్డన...
హైదరాబాద్, సెప్టెంబర్ 23: డీజిల్ ధరల పెంపు ను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) ఆర్టీసి ఛార్జీలను భారీగా పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. వరకు రూ.1, 26 కి.మీ. నుండి 45 కి.మీ. వరకు రూ.2, 46 ఆ పైన ప్రతి కిలోమీటరుకు రూ.5 పైసల చొప్పున పెంచింది. డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కి.మీ.కు 12 పైసలు పెంచింది. సిటీ బస్సుల్లో ఇప్పటి వరకు కనీస ఛార్జ్ రెండు స్టేజీల వరకు రూ.4 ఉండగా ఇప్పుడు రూ.5 కు పెంచారు. పెంచిన ఛార్జీలను బట్టి హైదరాబాద్ నుండి ప్రధాన నగరాలైన విజయవాడకు రూ.262, విశాఖకు రూ.625, తిరుపతికి 565, వరంగల్‌కు రూ.137 గా సూపర్ లగ్జరీ ఛార్జీలు ఉండనున్నాయి. గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, వెన్నెలస్సుల ఛార్జీలు యథాతథంగా ఉంటాయని, అయితే రద్దీని బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని ఆర్టీసి తెలిపింది. నెలవారీ సిటీ బస్ పాస్‌లపై రూ.100 మేరకు పెంచింది. అయితే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు యథాతథంగా ఉంచారు. డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసి పైన రూ.834 కోట్ల భారం పడిందని, కానీ తాము మాత్రం ప్రజలపై నామమాత్రం భారం మోపుతున్నామని ఆర్టీసి సగర్వంగా ప్రకటించింది.
Comments