Tuesday, September 4, 2012

కోల్ స్కాం పై రంగంలోకి దిగిన సి.బి.ఐ.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4:  బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం ఐదు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, వాస్తవాల వక్రీకరణ అభియోగాలు మోపింది. ఒక కేసులో కాంగ్రెస్ ఎంపీ విజయ్ దార్దా, ఆయన సోదరుడు, మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర దార్దాలను కూడా నిందితులుగా చేర్చింది.  కేసులు నమోదు చేసిన వెంటనే సీబీఐ దర్యాప్తు బృందాలు దేశవ్యాప్తంగా 11 నగరాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పాట్నా, ధన్‌బాద్, నాగ్‌పూర్, రాంచి, యావత్మాల్, భిలాయ్ నగరాల్లో పలు సంస్థల యాజమాన్యాల కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు చేపట్టాయి. 2006-09 సంవత్సరాల మధ్య బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై  ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు  ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు బొగ్గు గనుల కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలు.. జేఎల్‌డీ యావత్మాల్ ఎనర్జీ లిమిటెడ్, జేఏఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, నవ్‌భారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్, వాటిలోని 20 మంది డెరైక్టర్లు, గుర్తు తెలియని అధికారులపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదికపై వివాదం చెలరేగి గత రెండు వారాలుగా పార్లమెంటు స్తంభించిన నేపథ్యంలో.. సీబీఐ కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహించటం గమనార్హం. అయితే.. తాము కేసులు నమోదు చేయటానికి కాగ్ నివేదికకు సంబంధం లేదని సీబీఐ పేర్కొంది. కాగ్ సూచనల మేరకు బొగ్గు గనుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాత మూడు నెలల కిందట సీబీఐ అధికారులు ప్రాధమిక దర్యాప్తు నమోదు చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో బొగ్గు గనుల కేటాయింపులు పొందిన పలు సంస్థల పాత కార్యాలయాలను, క్షేత్రాలను కూడా సీబీఐ బృందాలు తనిఖీ చేశాయి. ఈ సంస్థలను కేవలం బొగ్గు గనుల కేటాయింపులు పొందటం కోసమే ఏర్పాటు చేశారని, కేటాయింపులు పొందిన తర్వాత అవే గనులను అధిక ధరకు వేరే సంస్థలకు సబ్ లీజుకు ఇచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. 2005లో గనుల కేటాయింపులు పొందిన కొన్ని సంస్థలు ఇంకా బొగ్గు తవ్వకాలు ప్రారంభించాల్సి ఉందని కూడా అధికార వర్గాలు తెలిపాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...