ఏంటి తేల్చేది...? కె.సి.ఆర్. అలానే అంటారు..తెలంగాణాపై షిండే

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణ అంశం తేలుతుందని తనకు సంకేతాలు అందినట్లు కెసిఆర్ చేసిన ప్రకటనను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నీరు గార్చారు.  తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చలేమని ఆయన సోమవారం స్పష్టంగానే చెప్పేశారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో తాము చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా తేలుతుందని కెసిఆర్ అన్నారు కదా అని అంటే కెసిఆర్ అలాగే అంటారు, అలా కాకుండా మరోలా ఎలా అంటారని ఆయన అన్నారు. మరో రకంగా మాట్లాడే అవకాశం కెసిఆర్‌కు లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఇదిగో అదిగో అనే మాట్లాడుతారని ఆయన అన్నారు. తెలంగాణపై అవగాహనకు మరింత సమయం పడుతుందని ఆయన చెప్పారు. తాను ఈ మధ్యనే హోం మంత్రి బాధ్యతలు స్వీకరించానని ఆయన చెప్పారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయన అన్నారు. నెలలో తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఎలా చెప్పారో తెలియదని, ఉద్యమ నాయకులు అలాగే చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణపై లోతుగా పరిశీలన చేయాల్సి ఉందని ఆయన అన్నారు. నక్సల్స్ సమస్యను ఆయన తెర మీదికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం కాబట్టి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గడ్‌లో నక్సల్స్ సమస్య పెరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ చాలా కాలంగా పెండింగులో ఉన్న అంశమని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ కొలిక్కి వస్తుందని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ విషయం హోం మంత్రిత్వ శాఖ దృష్టిలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని ఆయన అన్నారు.  మరోవైపు తెలంగాణపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా ఆదివారంనాడు చెప్పారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు