Wednesday, September 19, 2012

మమత పట్టు... కాంగ్రెస్ బెట్టు...

యూఢిల్లీ,సెప్టెంబర్ 19: కేంద్ర సర్కారుకు మద్దతు ఉపసంహరణకు సంబంధించి తమ వైఖరిలో మార్పులేదని.. తన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించటానికి.. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ అనుమతిని ఉపసంహరించాలని, డీజిల్ ధర పెంపును రూ. 5 నుంచి రూ. 3 లేదా రూ. 4 కు తగ్గించాలని, సబ్సిడీపై వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 24కు పెంచాలని  తృణమూల్ షరతులు పెట్టింది. యూపీఏ సంకీర్ణంలో 19 మంది ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. తృణమూల్ నిర్ణయంతో సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం పార్టీ కోర్ గ్రూప్ సమావేశంలో చర్చించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని, ఆర్థికమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు. డీజిల్ ధర, వంటగ్యాస్ సిలిండర్లకు సంబంధించిన నిర్ణయాలపై స్వల్పంగా మార్పులు చేయగల అవకాశం ఉంది కానీ.. ఎఫ్‌డీఐ నిర్ణయంపై వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్థికమంత్రి చిదంబరం బుధవారం మంత్రుల బృందం సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని,  అవి కొనసాగుతాయని  వ్యాఖ్యానించారు. తృణమూల్ మంత్రులు ఎవరైనా తమతో మాట్లాడాలనుకుంటే.. తాము ఎలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నామో వారికి వివరిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు.. ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేదీ లేదని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోనీ ధీమా వ్యక్తం చేశారు. 











No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...