Wednesday, September 5, 2012

హస్తినలో తెలంగాణా వేడి...

న్యూఢిల్లీ , సెప్టెంబర్ 5:  తెలంగాణ అంశం  దేశ రాజధాని  హస్తినను  వేడెక్కించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు యుపిఎ భాగస్వామ్య పక్షాలతో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు బిజెపి రాస్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల దీక్షను బుధవారం విరమించారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఎన్డియే అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి అగ్రనేతలు హామీ ఇచ్చారు. ఇక కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. వారు  కేంద్ర మంత్రి వాయలార్ రవిని,  హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకనట చేయకపోతే ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ తో తమ సత్తా చాటతామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లాబీయింగ్ మొదలెట్టారు. అధిష్టానం పెద్దలతో సమావేశమై సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ఒక ప్యాకేజీని ప్రకటించే విషయంపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...