Monday, September 24, 2012

చంద్రబాబు జీవన్మరణ యాత్ర...!

హైదరాబాద్ ,సెప్టెంబర్ 24: తొమ్మిదేళ్ళ అధికారం కోల్పోయిన తరువాత తొమ్మిదేళ్ళ నుంచి ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  2014 ఎన్నికలలో పార్టీ ని గెలిపించే లక్ష్యంతో జీవన్మరణ  పోరాటానికి సిద్ధపడుతున్నారు.  ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను  అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంనుంచి ప్రారంభిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లనాటి సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, యూపీఏలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఎన్డీయే రెండూ బలహీనమవుతున్నాయని.. ప్రాంతీయపార్టీల బలం బాగా పెరుగుతోందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడినా టీడీపీ కీలక భూమిక పోషించిందన్నారు. 2014 ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులుంటాయని ఆయన చెప్పారు.  తెలంగాణ అంశంపై తాను పార్టీలో అందరితో మాట్లాడుతున్నానని   చెప్పారు.     చంద్రబాబు ప్రతి రోజూ 18 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఒక్కో జిల్లాల్లో 100 నుంచి 125 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. హిందూపురంలో ప్రారంభమయ్యే యాత్ర గుత్తి మీదుగా కర్నూలు జిల్లా చేరుతుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ద్వారా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, నల్లగొండ మినహా మిగిలిన జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా మీదుగా కోస్తాలోని కృష్ణా జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకూ కొనసాగిస్తారు. జనవరి 26 నాటికి యాత్ర ఎక్కడకు చేరితే అక్కడే ముగిస్తారు. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు, పర్వదినాల సమయంలో యాత్రకు విరామం ఇస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...