Thursday, September 6, 2012

ఫీజు రీయింబర్సుమెంట్ పై విజయమ్మ దీక్ష

హైదరాబాద్ ,సెప్టెంబర్ 6:   విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్సుమెంట్ ను అమల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద  రెండు రోజుల దీక్ష ప్రారంభించారు. ఆమె దీక్షలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ నేతలు రెహ్మాన్, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చదువులు... పేదల హక్కుగా భావించిన  వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితుల పేరుతో పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు భారంగా భావిస్తోందో అర్థం కావటం లేదని విజయమ్మ అన్నారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు పై వైఎస్ జగన్ దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 
ముఖ్యమంత్రి విమర్శ...
 ఫీజు రీయింబర్సుమెంట్ పై  వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్ష రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  విమర్శించారు.  ప్రభుత్వం 99 శాతం మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై పునఃసమీక్షించేది లేదన్నారు. మేనేజ్‌మెంట్ కోటా భర్తీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని 550 ప్రయివేటు, 30 ప్రభుత్వ కళాశాలలతో ఎలాంటి సమస్య లేదని, కేవలం 85 కళాశాలలతోనే సమస్య ఉందన్నారు. అయినా వాటిపై కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున బోధనా రుసుము లేదని, కాంగ్రెసు హయాంలోనే ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...