Tuesday, October 25, 2011

అమర్‌సింగ్‌కు షరతులతో బెయిల్

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్టు అయిన రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు  ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని  జస్టిస్ సురేష్ కైట్ తన  పేర్కొన్నారు. అయితే ఇందుకోసం రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా దిగువ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టంచేశారు. విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కోర్టులో హాజరుకావాలని సూచించారు. వీటిలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా, దర్యాప్తు అధికారులు అమర్‌సింగ్ బెయిల్ రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో సెప్టెంబర్ 6న అమర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత అనారోగ్యానికి గురికావడంతో 12న ఎయిమ్స్‌లో చేర్చారు. 15న దిగువ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. అనంతరం అమర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున మళ్లీ అరెస్టు చేయాలని గతనెల 28న ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
 కనిమొళి దీపావళి జైల్లోనే ...!
డీఎంకే ఎంపీ కనిమొళి జైల్లోనే దీపావళి జరుపుకోనున్నారు. 2జీ కేసులో ఆమెతోపాటు మరో నలుగురు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. రెండ్రోజుల కిందటే ఈ కేసులో అభియోగాలు నమోదైన నేపథ్యంలో కనిమొళితోపాటు కలైంగర్ టీవీ చానల్ ఎండీ శరద్ కుమార్, కుసేగాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డెరైక్టర్లు ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీలు సోమవారం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి ఒ.పి.సైనీ విచారణ జరిపారు. న్యాయస్థానం తన విచక్షణ మేరకు వీరికి బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరమేమీ లేదని సీబీఐ ప్రత్యేక న్యాయవాది యు.యు.లలిత్ కోర్టుకు తెలిపారు.  2జీ కేసులో మే 20న అరెస్టయిన కనిమొళి అప్పట్నుంచీ కారాగారంలోనే ఉన్న సంగతి తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...