Friday, October 21, 2011

అంతమైన లిబియా నియంత

ట్రిపోలీ,అక్టోబర్ 21: :  42 ఏళ్ల పాటు లిబియాను తుపాకీ గొట్టం సాయంతో శాసించిన మహమ్మద్ గడాఫీ, చివరికి అదే తుపాకీకి బలైపోయాడు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా తిరుగుబాటు దెబ్బకు ఆగస్టులో పలాయనం చిత్తగించిన ఈ మాజీ సైనిక పాలకుడు, గురువారం తన సొంత పట్టణం సిర్త్ లోనే తిరుగుబాటుదారుల చేతిలో దారుణంగా కాల్చివేతకు గురయ్యాడు. ఓ కల్వర్టులో దాగిన 69 ఏళ్ల గడాఫీని తిరుగుబాటు దళాలు చుట్టుముట్టాయి. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని వేడుకున్నా వరుసబెట్టి బులెట్ల వర్షం కురిపించాయి.పారిపోయేందుకు ప్రయత్నించడంతో తొలుత రెండు కాళ్లపై కాల్చారు.  తీవ్రంగా గాయపరిచి సజీవంగా పట్టుకున్నాయి. అనంతరం కారులో తరలిస్తుండగా  గడాఫీ తుదిశ్వాస వదిలినట్టు సమాచారం. గడాఫీ మరణ వార్తను తొలుత అరబ్ టీవీ చానల్ అల్ జజీరా బయట పెట్టింది. అనంతరం లిబియా ప్రధాని మహమ్మద్ జిబ్రిల్ హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ధ్రువీకరించారు. ఈ క్షణం కోసమే తామంతా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నామన్నారు. గడాఫీ మృతి వార్త తెలియగానే లిబియాలో సంబరాలు మిన్నంటాయి. దేశవాసులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పరస్పరం కౌగిలింతలు, జాతీయ గీతాలాపనలతో పండుగ చేసుకున్నారు. ‘అల్లా హో అక్బర్’ నినాదాలు, విజయసూచకంగా తిరుగుబాటుదారుల గాల్లోకి కాల్పులతో రాజధాని ట్రిపోలీ హోరెత్తిపోయింది. కార్ల హారన్లను తారస్థాయిలో మోగిస్తూ వారు నగరమంతటా కలియదిరిగారు. గడాఫీ కుమారుడు ముతస్సిమ్, అతని రక్షణ మంత్రి అబూ బకర్ యూనిస్ జబర్ కూడా తిరుగుబాటు దళాల చేతిలో మరణించారు. గడాఫీ మృతిని నియంతృత్వానికి శాశ్వతంగా తెర దించిన చరిత్రాత్మక క్షణంగా జాతీయ అధికార మార్పిడి మండలి (ఎన్టీసీ) అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గోజా అభివర్ణించారు. లిబియావాసుల విజయంగా దేశ సమాచార మంత్రి మహమ్మద్ షమామ్ పేర్కొన్నారు.
తొలుత సైన్యంలో కెప్టెన్‌గా పని చేసిన గడాఫీ, 1969లో రక్తపాతరహిత కుట్రతో రాజు ఇద్రిస్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పటికి అతని వయసు కేవలం 27 ఏళ్ళు.  విరోధులు, ప్రత్యర్థులు మొదలుకుని అసమ్మతి గళం విన్పించిన వారి దాకా... లెక్కలేనంత మందిని హతమారుస్తూ గడాఫీ 42 ఏళ్ల సుదీర్ఘ పాలనంతా రక్తసిక్తంగానే సాగింది. మానవత్వంపై కిరాతక నేరాలకు పాల్పడ్డాడంటూ అతన్ని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం చిరకాలంగా ప్రయత్నిస్తోంది. గడాఫీ నియంతృత్వంపై లిబియాలో పెల్లుబికిన ప్రజాగ్రహం గత ఫిబ్రవరిలో అంతర్యుద్ధానికి దారితీసింది. దాన్ని కొంతకాలం పాటు ఎదుర్కొన్న గడాఫీ, ఆగస్టు మధ్యలో ట్రిపోలీ వదిలి పారిపోయాడు. సిర్త్, మరో ఒకట్రెండు పట్టణాలు మినహా దేశమంతా తిరుగుబాటు దళాల అధీనంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ నాటో దళాల సాయంతో తిరుగుబాటు సైన్యాలు అతని కోసం తీవ్రంగా వేటాడుతున్నాయి. గురువారం గడాఫీని హతమార్చిన గంటలోపే సిర్త్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్టీసీ ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...