Thursday, October 6, 2011

గడువులతో తేల్చలేం: అజాద్

న్యూఢిల్లీ, అక్టోబర్ 6:  తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించడం కుదరదని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. ‘‘ఇదొక చాలా ముఖ్యమైన సమస్య. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఈ తరహా విషయాల్లో మనం నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించలేం’’ అని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆజాద్ మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమించడానికి జేఏసీ నాయకులు తెలంగాణపై కాలపరిమితితో కూడిన ప్రకటన కావాలంటున్నారు కదా.. అన్న ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సభ్యుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరారు. ఇందుకు.. ‘‘ప్రణబ్‌దా మాట్లాడినదానిపైన నేను వివరణ ఇవ్వలేను. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలన్నారో నాకు తెలీదు. అయితే నేను పదేపదే ఓ సంగతి చెబుతున్నా. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో మేం దాదాపు రెండు నెలలపాటు సంప్రదింపులు సాగించాం. ఆ దశ పూర్తయ్యింది. పండుగ సెలవులు ముగి సిన తర్వాత జాతీయ స్థాయిలో రెండోవిడత సంప్రదింపులు కొనసాగిస్తాం’’ అని ఆజాద్ వివరణ ఇచ్చారు. సంప్రదింపులు పూర్తి కాగానే నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదీ పండుగ సీజన్‌లో వారికి కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాల్సిందిగా జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశామని, అయితే తాము కోరినవిధంగా జరగలేదని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...