Friday, October 21, 2011

రాజకీయ సుడిగుండంలో పోలవరం టెండర్ ...!

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పోలవరం చుట్టు తిరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమ్మక్కై అర్హత లేని కంపెనీకి పోలవరం టెండర్ దక్కేలా చేశారని  టి.డి.పి. విరుచుకుపడుతోంది. టెండర్ ప్రైస్ బిడ్ ఓపెన్ చేయడానికి ముందు టీడీపీకి చెందిన సీనియర్ నేత సీఎం రమేష్ తనకే పనులు దక్కుతాయని గంపెడాశ పెట్టుకున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కాంగ్రెస్‌తో తమకేమీ సంబంధం లేదని అంటూనే పోలవరం టెండర్ తనకే దక్కుతుందని మీడియా ముందే ధీమా వ్యక్తం చేశారు. రహస్యంగా సాగే ఈ టెండర్ ప్రక్రియలో ఎవరెంత కోట్ చేశారన్నది బయటకు తెలిసే అవకాశం లేదు. అయితే తనకే టెండర్ దక్కుతుందని రమేష్ ఏ ధీమాతో చెప్పారో అంతుబట్టని వ్యవహారం. తానే ఎల్-1 గా వస్తానని రమేష్ చెప్పడంతో టీడీపీకి ప్రభుత్వంలో ముఖ్యులకు మధ్య ఏదైనా రహస్య ఒప్పందం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తీరా బిడ్ ఓపెన్ చేస్తే అనూహ్యంగా ఎస్‌ఈడబ్ల్యూ (సూ) ఎల్-1 గా నిలిచింది. సహజంగానే ఈ పరిణామం టీడీపీకి మింగుడుపడలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంతో పాటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద రెండ్రోజులుగా సాగుతున్న పరిణామాలు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు టెండర్‌కు రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కాంగ్రెస్-టీడీపీ మధ్యే ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తే ఇప్పుడు ఆ వ్యవహారంలో టీఆర్‌ఎస్ చేరిందని తెలుగుదేశం ఆరోపణలు బట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం టెండర్ దక్కించుకున్న సూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన ఎల్.రాజం ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ పత్రికను సొంతం చేసుకున్నారు. దసరా మరుసటి రోజు ఆయన ఆ పత్రిక చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పుడు ఇది టీఆర్‌ఎస్‌కూ చుట్టుకుంది. సీఎం కిరణ్, కేసీఆర్ కుమ్మక్కై అర్హత లేని కంపెనీకి టెండర్ ఖరారు చేయించారన్నది టీడీపీ వాదన. మరి అంతకుముందు ఆ పార్టీకి చెందిన సీఎం రమేష్ తనకే టెండర్ వస్తుందని ఏ ధీమాతో చెప్పారని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ-టీఆర్‌ఎస్ చుట్టూ కేంద్రీకృతమైంది. విచిత్రమేమిటంటే.. వృథాగా పోతున్న వరదనీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగించేందుకు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. దీనివల్ల ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు నీటి కేటాయింపులో అన్యాయంపై తన గళం వినిపించే సీనియర్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్‌రావు కూడా ఆది నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్థాపించిన ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ కంపెనీకి టెండర్ దక్కడం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికారవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...