Tuesday, October 4, 2011

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

స్టాక్‌హోం(స్వీడన్), అక్టోబర్ 4:  వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. రోగనిరోధక వ్యవస్థపై విశేష పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు బ్రూస్ బ్యూట్లర్ (అమెరికా), జూల్స్ హాఫ్‌మాన్ (లక్సెంబర్గ్), రాల్ఫ్ స్టైన్‌మాన్ (కెనడా) లను ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ బహుమతికి ఎంపికచేసినట్లు సోమవారం అవార్డు న్యాయనిర్ణేతల కమిటీ ప్రకటించింది. వీరిలో  కేన్సర్‌తో బాధపడుతున్న స్టైన్‌మాన్ మూడురోజుల క్రితమే చనిపోయారు. కేన్సర్, తదితర ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగేలా, రోగనిరోధక వ్యవ స్థకు సంబంధించిన కీలక ప్రక్రియలను వీరు కనుగొన్నారని జ్యూరీ ప్రశంసించింది. వీరి పరిశోధన ఫలితాల వల్ల కేన్సర్, అస్తమా, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, క్రోన్స్ తదితర వ్యాధులకు కొత్త చికిత్సలు, మందులు కనుగొనే అవకాశమేర్పడినట్లు పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థను చైతన్యపర్చే కీలక గ్రాహక ప్రొటీన్‌లను బ్యూట్లర్( 55), హఫ్‌మాన్(70) కనుగొన్నారని జ్యూరీ తెలిపింది. వీరిద్దరూ ఇటీవల హాంగ్‌కాంగ్‌లో ప్రసిద్ధ షా ప్రైజ్‌ను కూడా స్వీకరించారు. శరీరంలోకి ప్రవేశించే హానికారక క్రిములను రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, హతమార్చేందుకు దోహదపడే డెండ్రైటిక్ కణాలను స్టైన్‌మాన్ కనుగొన్నారని పేర్కొంది.  నోబెల్ బహుమతి కింద ఇచ్చే నగదు మొత్తం కోటి స్వీడిష్ క్రోనార్లు( రూ.8.40 కోట్లు) కాగా అందులో బూట్లర్, హాఫ్‌మన్‌లకు సగం, స్టైన్‌మాన్‌కు సగం అందజేయనున్నట్లు జ్యూరీ ప్రకటించింది. అయితే స్టైన్‌మాన్ చనిపోయినందున ఆయనకు బహుమతి నగదు అంశంపై జ్యూరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోబెల్ అవార్డు వ్యవస్థాపకులు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో వచ్చే డిసెంబరు 10న జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డు ప్రదానం చేస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...