Wednesday, October 19, 2011

బాబుకు బాన్సువాడ దెబ్బ...

హైదరాబాద్ ,అక్టోబర్ 19:  బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మొహం చాటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారి ఉప ఎన్నికల ఫలితాల అంచనా తారుమారు కావడమే బాబును కలవక పోవడానికి కారణమని సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బాన్సువాడలో తెదేపా తరఫున అభ్యర్థిని నిలపవద్దని చంద్రబాబును టిటిడిపి నేతలు పోటీకి ముందు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయాలనే ఆలోచన బాబుకు ఉన్నప్పటికీ వారి సలహా మేరకు ఆయన అంతిమ నిర్ణయం బాధ్యత  వారికే అప్పగించారు.   2010 ఉప ఎన్నికల మాదిరి డిపాజిట్ కూడా దక్కక పోవచ్చుననే భావనతో టిటిడిపి ఫోరం నేతలు పార్టీ తరఫున అభ్యర్థిని దింపక పోవడమే మంచిదని భావించారు.  అదే సమయంలో కాంగ్రెసు మాత్రం పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. కాంగ్రెసు అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అందరూ భావించారు. కానీ అనూహ్యం అతను 33వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో టిటిడిపి ఖంగు తిన్నది. పోటీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనుకుంటే కాంగ్రెసుకు భారీ ఓట్లు రావడం వారిని పునరాలోచనలో పడేసింది. బాబు నిర్ణయం ప్రకారం పోటీకి దిగితే కనీసం క్యాడర్‌ను కాపాడుకునే వారమనే భావన వారిలో కలిగినట్లుగా కనిపిస్తోంది. ఉద్యమ ఉధృతంగా ఉన్న సమయంలో లక్ష మెజార్టీతో గెలుస్తాడని భావించిన తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం యాభై వేల మెజార్టీతో గెలుపొందటంతో బాబుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు మొహం చాటేస్తున్నట్లు కనిపిస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...