Tuesday, October 18, 2011

తెలంగాణ లో తెరుచుకున్న బడులు

హైదరాబాద్,అక్టోబర్ 18:  సుమారు నెలరోజుల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం పాఠశాలలు, కళాశాలలు పునప్రారంభం అయ్యాయి. సకల జనుల సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు గత నెల 16వ తేదీ నుంచి బంద్ పాటించాయి. అయితే విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు నడుపుతూనే ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించాయి. దాంతో నెలరోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు దూరంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట పట్టారు. 33 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న తర్వాత  సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సోమవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (టీజేఏసీ) ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 17 దాకా టీచర్లు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఈ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో పాటు సమ్మెను కొనసాగిస్తామని ఉన్నత విద్య జేఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ సమ్మెలో పాల్గొంటున్నారని ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...