Monday, October 31, 2011

గడ్డు స్థితిలో కిరణ్ సర్కార్...

హైదరాబాద్,అక్టోబర్ 31: రాష్ట్రంలో  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ సర్కారు గడ్డు పరిస్థితి లో పడింది.   17 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ అసెంబ్లీలో బలం 175కి చేరినా, మారిన పరిస్థితుల్లో ఇప్పుడది ఒకేసారి  143 కు పడిపోయింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీస మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148.  కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యే (మహబూబ్‌నగర్) రాజేశ్వరరెడ్డి మరణంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 293కు తగ్గింది. ఈ లెక్కన మెజారిటీకి కనీసం 147 మంది సభ్యుల మద్దతు అవసరం. అలా చూసినా కాంగ్రెస్‌కు నలుగురు సభ్యులు తక్కువవుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 26 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణపై కాంగ్రెస్  వైఖరి ని నిరసిస్తూ  ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య ఇటీవల శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు.  ఇప్పుడు  మరో ముగ్గురు  ఎమ్మెల్యేలు రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సోమారపు సత్యనారాయణ (రామగుండం) కూడా  కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో  పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పెరిగింది. రాజేశ్వరరెడ్డి మరణంతో కాంగ్రెస్ కోల్పోయిన ఎమ్మెల్యేల సంఖ్య 32కు చేరింది.  అయితే ఎమ్మెల్యేల రాజినామాలు పెండింగ్ లో వున్నందున సర్కారు  మైనారిటీలో పడినట్టు కాదని రాజకీయ నిపుణుల అంటుంటే ,ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వానికి బహిరంగంగా రాజీనామాలు ప్రకటించాక నైతికంగా వారంతా పార్టీకి దూరమైనట్టేనని , అధికార పార్టీకి వారి మద్దతు లేనట్టే అవుతుందని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. 
బలనిరూపణ అవసరం లేదు: గవర్నర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శానససభలో బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం  ఢిల్లీలో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అవసరమైన బలం ఉందని  చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాలు పెండింగులో ఉన్నాయని, ప్రభుత్వం మైనారిటీలో పడలేదని ఆయన అన్నారు.
ఎప్పుడు.. ఏమి చేయాలో తెలుసు: బాబు  
అధికారంలో కొనసాగే నైతిక హక్కును ప్రభుత్వం కోల్పోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వానికి నైతికత ఉంటే రాజీనామా సమర్పించి.. ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడూ.. ఏమి చేయాలో తమకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నైతికంగా కాక.. సాంకేతికంగా కొనసాగుతోందని బాబు వ్యాఖ్యానించారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...