Tuesday, October 25, 2011

పాలసీ రేట్లు పావు శాతం పెంపు

ముంబై,అక్టోబర్ 26: రెండంకెల స్థాయిలో ఆందోళన క లిగిస్తున్న  ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ మరోసారి పాలసీ రేట్లను పావుశాతం చొప్పున పెంచింది.  రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్యోల్బణం అదుపులోపెట్టేందుకు వృద్ధిరేటును కొంత పణంగా పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో గృహ, వాహన ఇతరత్రా అన్నిరకాల రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో పాటు నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు కూడా భారమయ్యే అవకాశం ఉంది. 2010 మార్చి నుంచి ఇప్పటిదాకా గడిచిన 20 నెలల్లో ఆర్‌బీఐ వడ్డీరేటును పెంచడం ఇది 13వ సారి కావడం గమనార్హం. మరోపక్క, సేవింగ్స్ బ్యాంక్(ఎస్‌బీ) ఖాతాలపై డిపాజిట్‌రేట్లపై నియంత్రణను ఎత్తివేస్తూ ఆర్‌బీఐ అతి కీలకమైన పాలసీ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇకనుంచి ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను స్వేచ్ఛగా నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ఖాతాదార్లకు తమ సొమ్ముపై మరింత రాబడిరావడంతో పాటు డిపాజిటర్లను ఆకర్షించేలా బ్యాంకుల మధ్య పోటీ కూడా పెరగనుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు ఇప్పుడున్న 8.25 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. రివర్స్‌రెపో రేటు ప్రస్తుతం 7.25 శాతం ఉండగా... ఇది 7.5 శాతానికి చేరింది. అయితే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...