Monday, November 22, 2010

కొనసాగుతున్న పార్లమెంట్ ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,నవంబర్ 22: పార్లమెంటులో వారంరోజులకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ చేపట్టిన దౌత్యం విఫలమైంది. సోమవారం ఉదయం, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష సభ్యులతో ఆయన నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితమివ్వలేదు. 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న పలు ఇతర దర్యాప్తు సంస్థల బృందాలను కూడా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)తో జతచేద్దామన్న ప్రభుత్వ సూచనను విపక్షాలు ముక్తకంఠంతో తోసిపుచ్చాయి. ప్రతిష్టంభన తొలగాలంటే జేపీసీ ఏర్పాటే ఏకైక మార్గమని స్పష్టంచేశాయి. దాంతో ప్రధానమంత్రి మన్మోహన్‌తో చర్చించాక, మళ్లీ కలుస్తానంటూ ప్రణబ్ వారికి హామీ ఇచ్చి, వెనుతిరిగారు. కాగా, 2జీ స్పెక్ట్రమ్ స్కాంపై జేపీసీ విచారణ కోరుతూ.. విపక్షాలు వరుసగా ఏడోరోజూ కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఉభయసభలను స్తంభింపజేశాయి. జేపీసీ ఏర్పాటును నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ప్రభుత్వ పక్షం కూడా అదే స్థాయిలో స్పందించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ భూకుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘యడ్యూరప్పను తొలగించాలoటూ ప్రతినినాదాలతో బదులిచ్చింది. 2జీ స్పెక్ట్రమ్ సహా ఆదర్శ్ హౌసింగ్, కామన్వెల్త్ అవినీతిలపై జేపీసీ విచారణకు ఆదేశించాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. ఇరుపక్షాలు పట్టువీడకపోవడంతో ఉభయసభలూ మంగళవారానికి వాయిదాపడ్డాయి. గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభల్లోనూ కొన్ని అధికారిక పత్రాలను మాత్రం ప్రవేశపెట్టగలిగారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...