Monday, November 29, 2010

వైదొలగిన జగన్...తల్లితో పాటు కాంగ్రెస్ కు గుడ్ బై

హైదరాబాద్,నవంబర్ 29 : కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా జగన్, విజయలక్ష్మి రాజీనామా చేశారు. వైఎస్ మరణానంతరం 14 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెంది ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన అయిదు పేజీల బహిరంగ లేఖ లో పేర్కొన్నారు.  జగన్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.


పార్టీ వ్యతిరేకిగా చిత్రించారు

తాను ఒంటరిగానే పార్టీ నుంచి బయటకు వెళుతున్నానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించి తనను ఒంటరిగానే బయటకు పంపాలనుకున్నారని సోనియాగాంధీకి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తనను బయటకు పంపించేందుకు ‘సాక్షి’ కథనాన్ని భూతద్దంలో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరిత కథనాలు ప్రచారం చేయించారని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.పదవులు ఆశచూపి తమ కుటుంబంలో చిచ్చు రేపుతారా అని జగన్ ప్రశ్నించారు. తాను చేసిన నేరమేంటని, ఎందుకు తనపై కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఓదార్పుయాత్ర చేయటమే తన తప్పా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీ సభలు, సమావేశాల్లోనూ వైఎస్‌ఆర్ ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారన్నారు.ఆయన మృతిపై కంటితుడుపుగానే దర్యాప్తు చేసిందన్నారు. చిరంజీవికి ఒక్కరోజులోనే అధిష్టానం అపాయింట్‌మెంట్ ఇచ్చిందని, అదే విషయంలో తన తల్లి నెలరోజులు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు.

రాజీనామాల పరంపర

వైఎస్ జగన్మోహన రెడ్డికి మద్దతుగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. జగన్ రాజీనామాతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. జగన్'కు మద్దతుగా అన్ని జిల్లాలలో ప్రదర్శనలు నిర్వహించారు. కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడలలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. పిసిసిలో కొందరు, రాష్ట్రంలోని పలు డిసిసిల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా నేతలు రాజీనామాలు చేశారు. యువజన కాంగ్రెస్ నేతలు కూడా పలువురు రాజీనామా చేశారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా అనేకమంది రాజీనామాలు చేశారు. వీరే కాకుండా పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్'లు రాజీనామాలు చేశారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...