జగన్ కు రాజకీయ పరిణతి లేదు: సి.ఎం.
హైదరాబాద్,,నవంబర్ 29: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి రాజకీయ పరిణితి లేదని నూతన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం తొందరపాటు చర్య అని, దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజకీయంలో 30 ఏళ్ల అనుభవం ఉండి శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెసు కార్యకర్తగా ఉన్న వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఇస్తే తప్పేమిటని, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కు ముఖ్యమంత్రి ఇవ్వడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. సోనియాను లక్ష్యంగా చేసుకొని జగన్ వర్గం మాటలు జారడం సరికాదని, రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు సోనియాగాంధీకి ఎప్పుడూ అవమానం జరగలేదని చెప్పారు. సాక్షి పత్రికలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ లేక్ వ్యూ అతిధి గృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో సీఎం తీర్మానం చేశారు. సోనియా ఆశయ సాధనకు పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
Comments