Tuesday, November 23, 2010

దంతెవాడలో కాల్పులు: 20 మంది నక్సల్స్ మృతి

రాయపూర్,నవంబర్ 23:   ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా లో మంగళవారం పోలీసులకు, నక్సల్స్ కు   నడుమ జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఇరవై మంది నక్సల్స్ మరణించారు.   అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్, సీఏఎఫ్, డీఎఫ్ దళాలకు చెందిన 101 మంది పోలీసులు ఏరియా డామినేషన్ కోసం వెళ్లారు. జేగురుకొండకు ఆరు కిలోమీటర్ల దూరంలోని కుందేడు, ఆశ్రమపడా గ్రామాల మధ్యనున్న అటవీ ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు రెండువందల మంది నక్సల్స్ పోలీసులపై కాల్పులు ప్రారంభించగా, పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. కొద్దిసేపు హోరాహోరీ కాల్పుల తర్వాత నక్సల్స్ పారిపోయారు. సంఘటనా స్థలంలో తొమ్మిది మంది మృతదేహాలు మాత్రమే లభించాయని, కనీసం ఇరవై మంది మరణించి ఉంటారని సీఆర్పీఎఫ్ ఐజీ పంకజ్‌కుమార్ సిన్హ్ చెప్పారు. సంఘటనా స్థలంలోని నెత్తుటి మరకల ఆధారంగా, కొన్ని మృతదేహాలను నక్సల్స్ తరలించుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలం నుంచి తొమ్మిది తుపాకులు, కొన్ని గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు, దండకారణ్యంలో భారీ దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశమై ఉంటారని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, బీజాపూర్ జిల్లాలోని ముర్తండా గ్రామం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన మైన్‌ప్రూఫ్ వాహనం ధ్వంసమైంది. వాహనంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఓంకార్ సిన్హా, డ్రైవర్ రామారావు అక్కడికక్కడే మరణించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...