Friday, November 19, 2010

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ రాత పరీక్షలు వాయిదా : తెలంగాణా లో హర్షం: సీమాంధ్రలో నిరసన

హైదరాబాద్ ,నవంబర్ 19: ఎస్‌ఐ రాత పరీక్షను వాయిదా వేయాలంటూ ఓయు జెఎసి విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 14(ఎఫ్) నిబంధనపై కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలిపారు.తమది బాధ్యతగల ప్రభుత్వమని, అన్నివర్గాలవారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. శాంతిని నెలకొల్పేందుకే పరీక్షను వాయిదా వేశామని, ఇంత గందరగోళం మధ్య విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరన్నారు.


టిఆర్ఎస్ బంద్ విరమణ

హోంమంత్రి ప్రకటనపై ఉస్మానియా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడంతో తెలంగాణలో చేయతలపెట్టిన బంద్ ని టిఆర్ఎస్ విరమించుకుంది. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశానికి సంబంధించి 14 (ఎఫ్)పై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.

సీమాంధ్ర లో నిరసన

ఎస్ఐ పరీక్షలను వాయిదా వేయడంతో సీమాంధ్ర జెఎసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల వాయిదాకు నిరసనగా శనివారం బంద్'కు పిలుపు ఇచ్చారు. తిరుపతి ఎస్'వి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీమాంధ్ర ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడాన్నినిరసిస్తూ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో విద్యార్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అభ్యర్థులు ఎంతో కష్టపడి వ్యయప్రయాసలకోర్చి పరీక్షలకు సిద్ధమయితే, ఇప్పుడు వాయిదా వేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్లు వ్యవహర్తిస్తోందన్నారు. విశాఖ లో కూడా విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కాగా బంద్ పిలుపు తో అన్ని యూనివర్శిటీల పరిధిలో శనివారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...