Thursday, November 25, 2010

విదేశీ పౌరసత్వం లేని ఎన్నారైలకు ఓటు

న్యూఢిల్లీ,నవంబర్ 25: ఉద్యోగం, చదువు, తదితర కారణాల రీత్యా వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కూడా త్వరలో ఓటు హక్కు లభించనుంది. ఈ మేరకు కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించేందుకుగాను గత వర్షాకాల సమావేశాల్లో ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం, సవరణ బిల్లు, 2010’ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసినట్లు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి లోక్‌సభలో చెప్పారు. విదేశాల్లో ఉంటూ అక్కడి పౌరసత్వం పొందనివారు మాత్రమే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని మంత్రి తెలిపారు. అయితే ఓటుహక్కు పొందిన వారు ఎన్నికల్లో ఓటు వేయాలంటే సొంత నియోజకవర్గానికి రావలసి ఉంటుందన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 1.10 కోట్ల మంది ప్రవాస భారతీయులున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లి ఆరునెలల్లోలోగా తిరిగిరాని వారి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించేవారు. వచ్చే 2014 లోక్‌సభ ఎన్నికలలోగా ప్రవాస భారతీయులు ఓటుహక్కును కల్పించనున్నట్లు ‘ప్రవాస భారతీయ దివస్’ సందర్భంగా ఈ ఏడాది మొదట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...