Thursday, November 18, 2010

రణరంగంగా మారిన ఉస్మానియా

హైదరాబాద్,నవంబర్ 18: హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్న ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలతో ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. ఎస్సై పరీక్షలను ఆపేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే ఉద్రిక్తతకు నిలయంగా ఉన్న వర్సిటీ కాస్తా, సాయంత్రం సీఎం చేసిన ప్రకటనతో ఏకంగా రణరంగంగా మారింది. పోలీసుల మోహరింపు, విద్యార్థుల ప్రతిఘటనలతో యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులు పలుచోట్ల విధ్వంసానికి దిగారు. పోలీసుల లాఠీచార్జిలో ఇద్దరు గాయపడటంతో వారిపైకి రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు కూడా రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.రబ్బరు బుల్లెట్లతో 8 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయి తార్నాక, హబ్సిగూడ, కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్సులపై విరుచుకుపడ్డారు. 18 బస్సులను ధ్వంసం చేశారు. యూనివర్సిటీకి నాలుగు వైపులా దారులన్నింటినీ పోలీసులు దిగ్బంధించారు. గవర్నర్ నరసింహన్, రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దగ్ధం చేశారు. రాత్రి 10 దాటాక పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చింది. పోలీసులు రబ్బర్ బులెట్లు, టియర్ గ్యాస్ వదలగా, బీ-హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్ నుంచి విద్యార్థులు రాళ్లు రువ్వారు. విద్యార్థుల రాళ్ల వర్షంలో ఓయూ సీఐ, మరికొందరు పోలీసులు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటాక కూడా పోలీసులు కాల్పులు జరుపుతుండటంతో విద్యార్థులంతా రోడ్లపైనే ఉండిపోయారు. పోలీసులు పెద్దసంఖ్యలో దూసుకువచ్చి హాస్టళ్లను ముట్టడికి ప్రయత్నించగా విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిఇంచారు. జాక్ నాయకుడు రాజారాం యాదవ్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణా బంద్ కు కేసీఆర్ పిలుపు

ఫ్రీ జోన్ రగడ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు విధించారు. ఇవి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వారం పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం హైదరాబాద్‌లో ఓయూ జాక్, తెలం గాణలో పీడీఎస్‌యూ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరా హారదీక్షలు చేపట్టాలని ఓయూ జాక్ నిర్ణయించింది. ఇదిలా వుండగా శనివారం తెలంగాణ బంద్ పాటించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...