Friday, March 11, 2011

తెలుగు సంస్కృతి కి 'ప్రాంతీయ ' తెగులు

విచక్షణ మరచిన మిలియన్ మార్చర్లు
ట్యాంక్ బండ్ పై 13 విగ్రహాలు ధ్వంసం
హైదరాబాద్,మార్చి 11: తెలంగాణ జేఏసీ గురువారం నిర్వహించిన  మిలియన్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగి, విధ్వంసంతో ముగిసింది. అడుగడుగునా ఖాకీల ఆంక్షలతో గురువారం ఉదయం రాష్ట్ర రాజధానిలో బంద్ వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం వేడెక్కింది. అనుకున్న సమయానికి ఉద్యమకారులు మిలియన్ మార్చ్ నిర్వహించారు.  ట్యాంక్‌బండ్ మీదున్న విగ్రహాలు, పోలీసు, మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 13 విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రేణులు అక్కడికి వచ్చిన నేతలపైనా దాడులకు దిగాయి.. మిలియన్ మార్చ్ కు  సహకరించలేదంటూ  టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పైనా  దాడి కి దిగారు.  ‘జనం వచ్చారని వచ్చావా?’ అంటూ మహిళలు ఆయన కారుకు అడ్డం తిరిగి తిట్లదండకం అందుకున్నారు. ‘మీ వల్లే తెలంగాణ రావడం లేదు’ అంటూ కాంగ్రెస్ ఎంపీలు కే.కేశవరావు, మధుయాష్కీలపై భౌతికదాడులకు దిగడంతో వారు పోలీసుల సాయంతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, మిలియన్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాజధానిని ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌ను అష్టదిగ్బంధం చేశారు. రహదారులన్నీ మూసేసి ఎక్కడివారిని అక్కడే అడ్డుకున్నారు. నేతల అరెస్టులు, బారికేడ్లు, చెక్‌పోస్టులతో నిలువరించే ప్రయత్నం చేశారు. రైళ్లు, బస్సులు రద్దుచేసి, రోడ్లను మూసేశారు. అతికష్టంగా మిలియన్ మార్చ్ లో పాల్గొన్న తెలంగాణవాదులు తమ నేతల అరెస్టులపై మండిపడ్డారు. నేతలను విడిచిపెట్టాల్సిందేనంటూ ట్యాంక్‌బండ్‌పై విధ్వంసానికి పాల్పడ్డారు. దీన్ని చిత్రిస్తున్న మీడియా వాహనాలపై దాడి చేశారు.  కెమెరాలను లాక్కుని హుస్సేన్ సాగర్‌లో పడేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ర్యాలీగా ట్యాంక్‌బండ్ వైపు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల రాళ్లు.. పోలీసుల బాష్పవాయు ప్రయోగాలతో ఓయూ రణరంగంగా మారింది. పోలీసులు ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని రహదారులన్నీ మూసేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత న్యూడెమోక్రసీ కార్యకర్తలు, బీజేపీ, సీపీఐ కార్యకర్తలు, టీఆర్‌ఎస్ శ్రేణులు ట్యాంక్‌బండ్‌కు చేరాయి.
 13 మంది మహనీయుల విగ్రహాలు ధ్వంసం
మిలియన్ మార్చ్ లో  తెలంగాణవాదులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న 13 మంది మహనీయుల విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వాటిలో 12 విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో పడేశారు. మరో నాలుగింటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. కూల్చేసిన ప్రతి విగ్రహం వద్ద.. కొమరం భీం విగ్రహం పెట్టాలని ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలలో   గురజాడ అప్పారావు, బళ్లారి రాఘవ, సర్ ఆర్థర్ కాటన్, త్రిపురనేని రామస్వామిచౌదరి, బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణదేవరాయలు, సిద్ధేంద్రయోగి, అన్నమాచార్య, ఎర్రాప్రగడ, నన్నయ భట్టు, కందుకూరి వీరేశలింగం, మరో రెండు విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సీఆర్ రెడ్డి, జాషువా, శ్రీశ్రీ, క్షేత్రయ్య విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...