Tuesday, March 15, 2011

అణు కేంద్రాల భద్రతపై సమీక్ష

న్యూఢిల్లీ,మార్చి 15:  జపాన్‌లో సంభవించిన సునామీ కారణంగా, అక్కడి అణు కేంద్రాలకు ముప్పు ఏర్పడిన నేపథ్యంలో భారత్‌లోని అణు కేంద్రాల భద్రతపై సమీక్షకు ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోని అణు కేంద్రాలపై సత్వరమే సాంకేతిక సమీక్ష జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఇవి తట్టుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నాయో, లేదో సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), జపాన్ అణు పరిశ్రమల మండలి, ప్రపంచ అణు కార్యకలాపాల సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ప్రధాని చెప్పారు.  ఇదిలా ఉండగా, జపాన్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిలో చాలామంది సునామీ ప్రభావిత ప్రాంతాల్లో లేనందున సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. భారతీయులెవరికీ హాని జరిగినట్లు ఎలాంటి సమాచారం రాలేదని, దాదాపు 70 మంది భారతీయులు మాత్రం సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. కాగా, భారత్‌లోని అణుకేంద్రాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని అణు ఇంధన కమిషన్ మాజీ చైర్మన్ అనిల్ కకోద్కర్ చెప్పారు. ముంబైలోని విధాన్ భవన్‌లో సోమవారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, సునామీ అనంతరం జపాన్ అణు కేంద్రాల్లో ముప్పు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అణు కేంద్రాల రూపకల్పన మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్‌లోను, భారత్‌లోను భూ ప్రకంపనల తీరు తెన్నులు వేరని, అందుకే గుజరాత్‌లో లోగడ భూకంపం సంభవించినా, తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని గుర్తు చేశా రు. మహారాష్టల్రోని జైతాపూర్ అణుకేంద్రానికీ ఎలాంటి ముప్పు లేదని, అణుకేంద్రం సముద్రమట్టానికి చాలాఎత్తులో పీఠభూమిపై ఉందని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...