Sunday, March 13, 2011

మృతులు వేలల్లో...నష్టం కోట్లలో...

దిక్కు తోచని జపాన్...
టోక్యో,మార్చి 13:  భూకంపం, సునామీల కారణంగా జపాన్‌లో మృతుల సంఖ్య 1,700 దాటినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాకాసి అలలు జపాన్ ఈశాన్యంలో 2,100 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కబళించాయి. పెద్ద సంఖ్యలో పల్లెలు, పట్టణాలు, నగరాలను సునామీ తుడిచిపెట్టింది. దాదాపు 23 అడుగుల ఎత్తైన  రాకాసి అలలు కొన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర భూమిపైకి చొచ్చుకువచ్చి . బోట్లు, కార్లు, ఇళ్లు, భవనాలను ముంచేశాయి. . ఒఫునాటో, సెన్సెకి, కెసెన్నుమా లైన్లలో నాలుగు రైళ్లు గల్లంతయ్యాయి. వాటిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. అంతకుముందు సెన్సెకి లైన్ మీద ఒక రైలు పడిపోయివుండగా గుర్తించారు. భూకంపం, సునామీల దెబ్బకు మొత్తం 3,400 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 181 సంక్షేమ భవనాలు, నర్సింగ్‌హోమ్‌లు దెబ్బతిన్నాయి. భూకంపం తాకిన ప్రాంతాల్లో 55.7 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా,ఆరు లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిచి పోయాయి. టోక్యో నగరంలో లోకల్ రవాణా వ్యవస్థ స్తంభించిపోవటంతో శుక్రవారం రాత్రి 1.20 లక్షల మంది ఇళ్లకు చేరుకోలేక వీధుల్లోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలన్నింటికీ సహాయ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. సహాయ చర్యల కోసం 20,000 మంది సైనికులు, 200 హెలికాప్టర్లు, విమానాలు, 25 బోట్లు రంగంలోకి దిగాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల నుంచి సహాయ బృందాలు జపాన్‌కు చేరుకుంటున్నాయి. దాదాపు 50 దేశాలు సహాయం ప్రకటించాయి.
' అణు భయం ' 
ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో పేలుడు సంభవించటంతో రేడియేషన్ విడుదలవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే అణు రియాక్టర్ ఉన్న కంటైనర్‌కు ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్లాంటు పరిసరాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించటం.. ప్లాంటు సమీపం నుంచి రక్షించిన ముగ్గురికి రేడియేషన్ సోకినట్లు నిర్ధారణ కావటం ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...