Tuesday, March 29, 2011

దాయాదుల పోరుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ,మార్చి 29:  దాయాదుల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ పోరుకు మొహాలీ స్టేడియం వేదిక కానుంది.  ఆటను చూడటానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీతో పాటు పలువురు వివిఐపిలు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్లు అద్భుత పటిమ కనబరుస్తూ సెమీ ఫైనల్‌కు వచ్చి కప్పు కోసం అమీ తుమీకి సిద్ధమయ్యాయి. కాగా,  ఈ ఆటలో భారత్‌తో పాటు పాక్ జట్టుపై కూడా ఒత్తిడి వున్నట్టు  కనబడుతోంది.   సొంత గడ్డపై ఆడటం, ప్రధాని, సోనియా వంటి హేమాహేమీలు మ్యాచ్ చూడటం తదితర అంశాలు భారత్‌ను ఒత్తిడికి గురి చేస్తే, ఫిక్సింగ్ హెచ్చరికలు పాక్‌ను  ఒత్తిడికి గురి చేసే అంశం.  ఈ దశలో భారత కెప్టెన్ ధోని తన సహచరులకు ఒత్తిడికి గురి కావద్దని సూచనలు చేస్తున్నారు. మ్యాచ్‌ను కూడా ఎక్కువగా ఊహించుకోవద్దని ధోనీ సూచనలు ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన బ్యాట్ బరువు కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. బరువైన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సచిన్ సిద్ధమయ్యారు. గ్రూప్ దశలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకొని సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో  ఆడిన మ్యాచ్‌లో మాత్రం భారత క్రికెటర్లు  సమష్టిగా రాణించి విజయం సాధించారు. ఆసీస్‌పై సమిష్టి విజయం, యువరాజ్ సింగ్ ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే బౌలింగ్‌లో ఆసీస్ మ్యాచ్‌లో తప్ప మొదటి నుండి జహీర్ తప్ప మిగిలిన ఫేసర్లు ఎవరూ అతనికి తోడ్పాటు ఇవ్వడం లేదు. గ్రూపు దశలో దక్షిణాఫ్రికాతో ఓటమి చెందిన భారత్ ఓ దశలో అందరి అంచనాలలోనుండి తొలగిపోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆసీస్‌పై గెలుపుతో అవే అంచనాలు భారీగా పెంచుకుంది. బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు బలంగానే ఉన్నప్పటికీ ఒక్క వికెట్ కోల్పోతే క్యూలైన్ కట్టడమే భారత్‌ను భయపెడుతున్న అంశం. ఆసీస్ మ్యాచ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇదే మనకు ఊరట. అటు పాక్ లో తన భుజ బలంతో పాటు బుర్రతో బౌలింగ్ చేసే ఉమర్ గుల్ భారత  బ్యాట్స్ మెన్లను  కట్టడి  చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే పాక్ కెప్టెన్ అఫ్రిదీ సచిన్‌ను  సెంచరీలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఒకప్పుడు  సచిన్ వర్సెస్ అక్తర్ పోరు ఇప్పుడు సచిన్ వర్సెస్ ఉమర్ గుల్ మధ్య సాగనుంది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...