Friday, March 11, 2011

భారీ భూకంపం, సునామీ లతో జపాన్ అతలాకుతలం

టోక్యో, మార్చి 11: జపాన్‌లో భారీ భూకంపం, సునామీ సంభవించాయి.  జపాన్ సముద్ర అంతర్భాగంలో సంభవించిన భూకంప తీవ్రత  రెక్టార్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. భూకంప ధాటికి వందలాదిమంది మరణించారు.  భవనాలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇరవై అడుగుల మేర పోటెత్తిన సముద్ర అలలలో  పట్టణాలు నేలమట్టమవుతున్నాయి. భారీ ఆకాశహర్మ్యాలు, సుందర భవనాలు, చారిత్రక కట్టడాలు  పునాదులతో సహా కదిలి కడలి గర్భంలో కొట్టుకుపోతున్నాయి. చారిత్రక సెందాయ్ నగరంలో పాతిక అడుగుల మేర జలరాశి మహోగ్రంగా పోటెత్తుతోంది. ప్రజలు  భవంతులపైకి చేరి రక్షించమని హాహాకారాలు చేస్తున్నారు. సునామీ ప్రభావం రష్యా, మార్కస్ ఐలాండ్, ఉత్తర మారియానాలో కూడా  వుండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రంగంలోకి దిగిన జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సేవా సంస్థలు హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.చిబా వద్ద ఆయిల్ రిఫైనరీ కేంద్రం నీటిలో మునిగిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపు అగ్నికీలలు చిమ్మిన ఈ రిఫైనరీ కేంద్రం, ఆనక కడలి ఒడిలో శాంతించింది. ఈ పరిస్థితి నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఐదు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేసింది. యురేనియం నిల్వల తరలింపునకు చర్యలు చేపట్టింది. భారీ భూకంపానికి గురైన జపాన్‌లో అత్యవసరపరిస్థితిని విధించారు. భూకంపం దాటికి ఓడలు, భవనాలు, వాహనాలు, ఫ్లైఓవర్లు కొట్టుకుపోయి జపాన్ లో దయనీయస్థితి కనిపిస్తోంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై జపాన్ అంధకారంలో మునిగిపోయింది. ఓకే ప్రాంతంలో పలుమార్లు భూకంపం వ చ్చినట్టు సమాచారం..జపాన్ సముద్ర అంతర్భాగంలో సంభవించిన భూకంపం ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపై అధికంగా వున్నట్లు అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా సుమారు పందొమ్మిది దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. తైవాన్, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెక్సికో, పిలిప్పీన్ దేశాలకు సునామీ ముప్పు పొంచి వున్నదని, ఆయా దేశాల్లో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా దేశాల ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నాయి. జపాన్ లో  1995 సంవత్సరం తర్వాత ఇదే అతిపెద్ద భూకంపంగా భావిస్తున్నారు. ఆసియా ఖండానికి తూర్పు ముఖద్వారంగా నెలవై వున్న జపాన్ దేశం చిన్న చిన్న దీవుల సముదాయం. సుమారు రెండువేల దీవులు జపాన్ దేశ పరిధికి చెందుతాయి. వీటిలో పది దీవులు మినహా మిగిలినవన్నీ భూపరిమితి తక్కువ కలిగిన దీవులు. తాజా సునామీ బీభత్సంలో ఈ చిన్న చిన్న దీవులన్నీ తుడిచి పెట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...