Saturday, March 5, 2011

కాంగ్రెస్ తో డీఎంకే కటీఫ్...

 నిన్నటి అనుబంధం...
* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకేల మధ్య బెడిసి కొట్టిన పొత్తు
* 60 స్థానాలు ఇస్తామన్న డీఎంకే; 63కు కాంగ్రెస్ పట్టు

న్యూఢిల్లీ, మార్చి 6:  కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు సంక్షోభంలో పడింది. పాలక సంకీర్ణం నుంచి వైదొలగుతున్నట్టు కూటమిలోని రెండో అతి పెద్ద భాగస్వామ్య పక్షమైన డీఎంకే శనివారం ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన డీఎంకే... కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగి, యూపీఏకు అంశాలవారీగా మాత్రమే మద్దతు కొనసాగించాలని చెన్నైలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయించింది. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలను సహించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు మంత్రివర్గం నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్  కోరినట్టు 60 సీట్లిచ్చేందుకు కూడా తంగీకరించామని, అయితే  హఠాత్తుగా తమకు 63 సీట్లు కావాలని డిమాండ్ చేసిందని  పైగా ఎక్కడెక్కడ పోటీ చేయాలో తామే నిర్ణయించుకుంటామంటూ మడతపేచీ పెట్టిందని, తమ పార్టీని   వదిలించుకోవడమే దీని వెనక ఏకైక ఉద్దేశంగా కనిపిస్తోందని కరుణానిధి మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరి స్పష్టం కావడంతో, ఇక యూపీఏలో కొనసాగడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం రంగంలోకి దిగారని, ఆదివారం ఉదయానికి ఆయన చెన్నై చేరుకుంటారని తెలిసింది. మరో మంత్రి ప్రణబ్ నేరుగా కరుణతో మాట్లాడే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. అయితే , కరుణానిధి ఆరోపణలపై కాంగ్రెస్ ఇంతవరకు స్పందించలేదు. అనవసర వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయబోమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు.
యూపీఏ కు గడ్డు పరిస్థితి
 543 మంది సభ్యుల లోక్‌సభలో సాధారణ మెజారిటీ 272 కాగా, యూపీఏ ప్రస్తుత బలం 260 మాత్రమే. డీఎంకే వైదొలగుతుండటంతో అది 242కు పడిపోనుంది. 19 మంది ఎంపీలున్న తృణమూల్  యూపీఏలో భాగస్వామి కాగా,  సమాజ్‌వాదీ (22 మంది ఎంపీలు), బీఎస్పీ (21), ఆర్జేడీ (4), జేడీ-ఎస్ (3)  పార్టీలు యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఉమ్మడి బలగాల ఉనికిపై తృణమూల్ అధ్యక్షురాలు, రైల్వే మంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. వాటిని ఉపసంహరించకుంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు. ఇక మే నెలలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు కూడా నానాటికీ క్లిష్టంగా మారుతోంది. తమకు మూడో వంతు సీట్లు కావాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మానస్ భుయా శనివారం డిమాండ్ చేశారు! కాంగ్రెస్‌తో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా, ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోనని మమత ఇప్పటికే కరాఖండీగా  చెప్పారు. తాజా పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...