Thursday, June 2, 2011

దీక్ష పై వెనక్కు తగ్గేది లేదు:రాందేవ్

న్యూఢిల్లీ,జూన్ 2 : అవినీతి, నల్లడబ్బు సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేస్తానంటూ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రకటించడంతో గుబులు చెందిన ప్రభుత్వం, ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. దీక్ష ఆలోచనను విరమింపజేసేందుకు ఏకంగా నలుగురు మంత్రులను రాయబారానికి పంపి, దాదాపు ఎర్రతివాచీ స్వాగతం పలికినా ఫలితం లేకపోయింది. తన డిమాండ్లకు ప్రభుత్వం వందశాతం అంగీకరిస్తే తప్ప దీక్ష యోచనను విరమించుకునే ప్రసక్తే లేదని రామ్‌దేవ్ తేల్చిచెప్పారు. నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఢిల్లీ చేరుకున్న బాబా రామ్‌దేవ్‌కు కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబల్, పవన్‌కుమార్ బన్సల్, సుబోధ్‌కాంత్ సహాయ్‌లు స్వాగతం పలికారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారు రామ్‌దేవ్‌కు ఎదురేగి, ప్రభుత్వం తరఫున ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రుల వెంట కేబినెట్ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్ కూడా ఉన్నారు. విమానాశ్రయంలోనే వారు రామ్‌దేవ్‌తో దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. అవినీతి, నల్లడబ్బు సమస్యపై ఇప్పటికే అన్నా హజారే చేపట్టిన దీక్షతో ఇరకాటంలో పడ్డ కేంద్రం, ఈసారి అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లడబ్బును భారత్‌కు తిరిగి తెచ్చే విషయంలో హామీలు సరిపోవని, ప్రభుత్వం తన చేతల్లో నిరూపించుకోవాలని రామ్‌దేవ్ తనతో చర్చలకు వచ్చిన మంత్రులకు సూచించారు. కేవలం హామీలతో సంతృప్తి చెందబోమని, నల్లడబ్బును వెనక్కు తేవడంపై ఆధారాలు కావాలని ఆయన అన్నారు. అవినీతికి, నల్లడబ్బుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలోను, దేశవ్యాప్తంగా 624 జిల్లాల్లోను సత్యాగ్రహం (నిరాహార దీక్షలు) ప్రారంభమవుతుందని రామ్‌దేవ్ ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...