Saturday, June 18, 2011

తెలంగాణపై తేల్చని కాంగ్రెస్ కోర్ కమిటీ

న్యూఢిల్లీ, జూన్ 18:  శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తెలంగాణపై ఏమీ తేల్చకుండా కేవలం ప్రస్తావనతోనే సరిపెట్టింది. రాష్ట్రంలోని పార్టీల వైఖరిపై తనకు నివేదిక ఇవ్వాలని నేతలను ఆదేశించిన మేడం సోనియా, వాటిని పరిశీలించాకే తెలంగాణపై ఏం చేయాలో నిర్ణయిద్దామన్నారు.  రెండు గంటల పాటు సమావేశమైన కోర్‌కమిటీ ప్రధానంగా జన్ లోక్‌పాల్ బిల్లు, అన్నాహజారే దీక్ష హెచ్చరికలపైనే దృష్టి సారించింది. సోనియాతో పాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కేంద్రమంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఏకే ఆంటోనీ, చిదంబరం సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమతో జరిపిన చర్చల సారాంశాన్ని చిదంబరం, ప్రణబ్ సోనియా దృష్టికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు... పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు రాకుంటే ఆగస్టు 16 నుంచి మళ్లీ నిరశన చేస్తానన్న హజారే హెచ్చరిక నేపథ్యంలో జూన్ 30 కల్లా ముసాయిదాను పూర్తి చేయడంపైనే దృష్టి పెడదామని సోనియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను కూడా పిలిపించి తెలంగాణపై తర్వాత విస్తృతంగా చర్చిద్దామని చెప్పారు. ఆలోగా రాష్ట్ర పార్టీల మనోగతం, అఖిలపక్ష భేటీకి వాటి సంసిద్ధతలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాటన్నింటినీ పరిశీలించాక తెలంగాణపై తదుపరి ఏం చేయాలో నిర్ణయిద్దామన్నారు. భేటీలో తెలంగాణపై చర్చించినట్టు విలేకరులకు చెప్పిన చిదంబరం, అహ్మద్‌పటేల్... అంతకు మించి మాట్లాడేందుకు నిరాకరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...