Tuesday, June 21, 2011

తెలంగాణ పై సోనియా చేతులెత్తేశారా...?

న్యూఢిల్లీ, జూన్ 21:  ప్రత్యేక తెలంగాణ  అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులెత్తేశారా...? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చాలా క్లిష్టమైనదని దానిపై తాను ఒక్క దానిని నిర్ణయం ఎలా తీసుకోగలనని మూడు రోజుల క్రితం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంత జటిలమైన సమస్యపై నిర్ణయం తీసుకోవడం తన ఒక్కదాని వల్ల అవుతుందా అని ఆమె కోర్ కమిటిలోని సభ్యులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై గత కొన్నాళ్లుగా   టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో పాటు, కేంద్రమంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ కూడా సోనియా గాంధీపైనే భారం మోపారు. ఇటీవల తమను కలిసిన టి-కాంగ్రెసుకు కూడా కేంద్రమంత్రులు అమ్మ చెబితేనే అవుతుందని తేల్చి చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని  సోనియా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావించిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సోనియా తన అశక్తత వ్యక్తం చేయడంతో  నీరుగారి పోయారు. ఇన్నాళ్లు వారు సోనియాపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కూడా వారు అదే మాటను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ సోనియా అనూహ్యంగా తన అశక్తత వ్యక్తం చేయటంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని కూడా కొందరు అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు తాము అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టలేదని చెప్పి తప్పించుకోవాలని చూడగా, మరికొందరు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతోంది. జూన్ 30 వరకు తెలంగాణపై తేల్చకుంటే వచ్చే నెల 5 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే రాజీనామాలకు సిద్ధమని టి-కాంగ్రెసు చెప్పింది. కాగా,  ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఇటు తెలంగాణవాదులను, అటు తమ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూల్ చేయడానికి అథిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...