Thursday, June 2, 2011

తెలంగాణ పై " సాగ ' తీతే...!

న్యూఢిల్లీ,జూన్ 2 :  ప్రత్యేక తెలంగాణ అంశాన్ని వీలైనంతగా సాగదీసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. శ్రీకష్ణ కమిటీ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో తలపెట్టిన రెండో అఖిలపక్ష సమావేశాన్ని మాళ్ళీ 8 పార్టీలూ హాజరైనప్పుడే  నిర్వహించే యోచనలో ఉన్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం ఈ సందేహానికి తావిస్తోంది. 8 పార్టీల నుంచీ స్పష్టమైన హామీ లభించినప్పుడే అఖిలపక్షం జరుగుతుందని కూడా  ఆయన దాదాపు స్పష్టం గానే  చెప్పారు. అఖిలపక్షానికి వెళ్లేందుకు పలు పార్టీలు ససేమిరా అంటుండటం, తెలంగాణపై కేంద్రమే తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. మలివిడత అఖిలపక్షంలో పార్టీలు వెలిబుచ్చే అభిప్రాయాల ఆధారంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి చిదంబరం గతంలోనే ప్రకటించడం తెలిసిందే. అంటే, ఆ భేటీ జరగనంత కాలం దీనిపై కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోబోదని బోధపడుతోంది. మొత్తానికి కొరకరాని కొయ్యలా మారిన తెలంగాణ సమస్యను అఖిలపక్ష భేటీతో లంకె పెట్టి, దానిపై అంతర్గతంగా  ఓ నిర్ణయానికి రావడానికి సమయం తీసుకుంటోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  కాగా తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేలిపోతుందని సర్వత్రా భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం తాజా ప్రకటన మరో గందరగోళానికి తెర లేపిందనే చెప్పాలి. చిదంబరం పాత పాటనే పాడారంటూ పార్టీలు, సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. అనిశ్చితిని పెంచేలానే ఆయన తీరుందని మండిపడుతున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...