Wednesday, June 1, 2011

‘ చింతన్ శిబిర్ ’లో తెలంగాణపై తేలుస్తారా...?

హైదరాబాద్ ,జూన్ 1:  తెలంగాణ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం జూన్ రెండోవారంలో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ రెండోవారంలో రాజస్థాన్‌లోని మౌంటు అబు లో  నిర్వహించనున్న ‘ చింతన్ శిబిర్ ’లో తెలంగాణపై సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ వ్యవహారాన్ని ఇక నాన్చకూడదని, ఏదోకటి తేల్చాలంటూ సొంత పార్టీ నాయకుల నుంచే అధిష్ఠానవర్గంపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సుమారు మూడు వందల మంది చింతన్ శిబిర్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రధాన మంత్రి, ఎఐసిసి ఆఫీసు బేరర్లు, కోర్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధికారంలోలేని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు, పిసిసి అధ్యక్షులు తదితరులు ఇందులో పాల్గొంటారు. గతంలో ఇటువంటి సమావేశాలను 1998లో పంచ్‌మడిలోను, 2003లో సిమ్లాలోను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించింది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల రెండు రోజుల నగర పర్యటనకు వచ్చి రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ, సీమాంధ్ర నాయకుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చడం మంచిది కాదని, ఏదోక నిర్ణయాన్ని త్వరగా తీసుకోవడం మంచిదని అధిష్ఠానానికి అజాద్ తెలియజేశారు. కాగా, ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని, ఇందుకు రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే మహారాష్టల్రో ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. వీటన్నిటితో తెలంగాణ అంశాన్ని కూడా కలిపి రెండో ఎస్సార్సీ ఏర్పాటుకే అధిష్ఠానం నిర్ణయం తీసుకోచ్చన్న వాదన  వినిపిస్తోంది.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...