Thursday, June 2, 2011

కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పై టీపీడీ అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్,జూన్ 2 : కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పై టీపీడీ  అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది.  అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు  టీపీడీ నేతలు అందించారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అందుబాటులో లేకపోవటంతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసును  అందచేశారు. అలాగే శాసనసభ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందువల్లే తప్పని పరిస్థితుల్లో రైతు సమస్యలపై అవిశ్వాసం పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలైనా, పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొనకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. అధికారం కోసం తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని తెలిపారు.   మరోవైపు అవిశ్వాస తీర్మానానికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కాగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు.  ఇలావుండగా కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష టీడీపీ ఏ విషయాలపై అయితే అవిశ్వాస తీర్మానం పెట్టిందో అవే విషయాలపై తమకు కూడా చర్చ అవసరమని అన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాలు పడిపోయేది లేదు, ప్రతిపక్ష పార్టీలు బలపడేది లేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...