Sunday, June 19, 2011

వంటా-వార్పు శాంతియుతం

హైదరాబాద్,జూన్ 19:   గల్లీ నుంచి మెయిన్ రోడ్డు దాకా గ్రేటర్ హైదరాబాద్ అంతటా తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. పార్టీలకు అతీతంగా నేతలు, పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు స్వచ్ఛందంగా రోడ్లెక్కారు. ప్రతి రోడ్డు మీదా పొయ్యి పెట్టి, వండి వార్చి, భోజనాలు చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా, ‘పట్నం రోడ్లమీద పొయ్యిపెడదాం’ అంటూ రాజకీయ జేఏసీ ఆదివారం నిర్వహించిన వంటావార్పు శాంతియుతంగా సాగింది. తెలంగాణ మాటాముచ్చట్లు, తెలంగాణ అమరుల త్యాగాలను కీర్తిస్తూ పోరాట స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కళారూపాలు, ఆటపాటలతో ప్రభుత్వాల తీరుపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు.   కెసిఆర్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై ఇప్పుడు మాట మారిస్తే దేశం పరవు పోతుందని సూచించారు. కొంతమంది కుహనా సమైక్యవాదులు చేస్తోన్న ప్రకటనలు శాంతియుతంగా సాగుతోన్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, వారి ప్రకటనలతో ఏవైనా తీవ్ర  పరిణామాలు తలెత్తితే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కెసిఆర్ హెచ్చరించారు.తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ఇకనైనా ఢిల్లీలో కాళ్ళబేరాలు, రాయబారాలు, పైరవీలు కట్టిపెట్టి హైదరాబాద్‌కు తిరిగి   వచ్చి సామూహికంగా రాజీనామాలు చేయాలని  అన్నారు.  ‘మీరు రాజీనామాలు చేసినా అవేమీ ఆమోదం పొందవు. మీ రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. వాటిని ఒకవేళ ఆమోదించినా, నేను, జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రజల కాళ్లు మొక్కి అయినా లక్షలాది ఓట్ల మెజార్టితో గెలుపించుకుంటాం’ అని కెసిఆర్ హామీ ఇచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడలాంటే అదేమీ దీక్షలతో అయ్యే పనికాదు. త్యాగాలు చేయకతప్పదు. రాజీనామాలు చేస్తేనే ఢిల్లీ పీఠం కదులుతుంది’ అన్నారు. త్వరలోనే కాంగ్రెసు ఎంపిలతో భేటీ అయి, అన్ని విషయాలూ చర్చించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు సమిష్టిగా కార్యాచరణ రూపొందిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్  కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్ రెడ్డి హైటెక్ సిటీ వంటావార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  తన తండ్రి పి.జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసం, జివో 16 ఎత్తివేత కోసం, పోతిరెడ్డి పాడు పై అలుపెరగని పోరాటం చేశారని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...