Thursday, June 2, 2011

బాబు కు చెలగాటం...జగన్ కు సంకటం...కిరణ్ కు ఇరకాటం ...

హైదరాబాద్,జూన్ 2 :  అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారు. వైయస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వడంతో వైయస్ జగన్ తన జెరూసలెం పర్యటనను రద్దు చేసుకున్నారు. జెరూసలేంకు ఆయన గురువారం రాత్రి బయలుదేరి వెళ్లి 11వ తేదీన తిరిగి రావాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వడంతోనే జగన్ తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ స్థితిలో జగన్ సత్తా ఏమిటో చూపించడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. జగన్‌కు బలం లేదు, సత్తా లేదని చూపించడానికే చంద్రబాబు ఈ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తమ వైపు ఎంత శాసనసభ్యులు వస్తారనే విషయంపై జగన్ గురువారంనాటి సమావేశంలో చర్చించారు. శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే జగన్ అవిశ్వాస తీర్మానం విషయంలో దెబ్బ తింటారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించే కాంగ్రెసు శాసనసభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని ఈ మధ్యనే వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సందర్భం వస్తే తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా జగన్ వర్గం శానససభ్యులు అంటూ వస్తున్నారు. వారివి గాలి మాటలేనని తేల్చేయడానికే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో మూడేళ్ల పాటు శాసనసభ్యులుగా కొనసాగడానికి అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది కూడా అనుమానమే. మొత్తంగా జగన్ రాజకీయ పరిపక్వతకు అవిశ్వాస తీర్మానం పరీక్ష పెట్టబోతోంది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...