Thursday, June 9, 2011

వివాదస్పద చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ మృతి

లండన్ ,జూన్ 9: అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నప్పటికీ  వివాదస్పదునిగా పేరు పొందిన భారతీయ చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ (మక్బుల్ ఫిదా హుస్సేన్) లండన్‌లో గుండెపోటుతో మరణించారు. భారతీయ పికాసోగా పేరున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ వయస్సు 95 సంవత్సరాలు. చిత్రకళను ఆరాధించే ప్రతి ఒక్కరికి ఆయన ‘ఎమ్‌ఎఫ్’గా సుపరిచితుడు. హుస్సేన్ మహారాష్ట్రలోని ఫండర్‌పూర్‌లో సెప్టెంబర్ 17 తేది 1915 లో జన్మించారు.  హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా చిత్రాలు గీసారన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్డు ఆర్డర్లకు స్పందించకపోవడంతో  హుస్సేన్ ఆస్తుల్ని జప్తు చేసేందుకు నిర్ణయం తీసుకొని బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. పలు వివాదస్పద ఆరోపణల మధ్య  హుస్సేన్ స్వయంగా దేశ బహిష్కరణ విధించుకున్నారు.ప్రముఖ బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, టబులతో నిర్మించిన హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాధురీ దీక్షిత్‌తో ‘గజగామిని’, టబుతో ‘మీనాక్షి- ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీ’ అనే చిత్రాలకు నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అంటే చెప్పలేనంత ఆకర్షణ అని పలు సందర్భాల్లో హుస్సేన్ వ్యాఖ్యానించారు.  1973 లో ఆయనకు పద్మభూషణ్ అవార్డును భారతప్రభుత్వం, రాజా రవివర్మ అవార్డును కేరళ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆయన 1986లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...