Thursday, June 23, 2011

మంత్రివర్గాల విస్తరణపై మలాగుల్లాలు

న్యూఢిల్లీ, జూన్ 23: పాఠ్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే లోగానే కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 2న ఈ కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ జూలై 3న లోక్‌పాల్ బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినందున ఆ రోజు విస్తరణ జరిగే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా కాని పక్షంలో జూలై 9న జరగవచ్చంటున్నారు. ఒక వైపు లోక్‌పాల్ బిల్లు గొడవ, మరోవైపు డిఎంకె ఎత్తుగడలు నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులను కొంత కాలం వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఒక వేళ ప్రధాని మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పక్షంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు, ఇద్దరు లేదా ముగ్గురు జూనియర్ నాయకులకు మంత్రిపదవులు లభించే అవకాశాలున్నాయి. లోక్‌సభ సీనియర్ సభ్యులు కెఎస్ రావు, కిశోర్ చంద్రదేవ్‌లకు క్యాబినెట్ మంత్రి పదవులు లభించవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా పని చేస్తున్న డి.పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి పదోన్నతిని ఆశిస్తున్నారు. తమను ఇండిపెండెంట్ మంత్రులుగా నియమించాలని వారు కోరుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, కెఎం ఖాన్, జెడి శీలం, లోక్‌సభ సభ్యులు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, హర్షకుమార్ తదితరులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీరిలో పలువురు సోనియాను కలిసి తమ వాదనలు కూడా వినిపించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఇటీవలే విలీనమైన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మంత్రివర్గంలో స్థానం లభించటం ఖాయమని భావిస్తున్నారు. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే మొదట ఆయనను రాజ్యసభకు తీసుకురావలసి ఉంటుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. సోనియా గత మూడు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పని తీరుతెన్నులు, మంత్రివర్గంలో చేయవలసిన మార్పులు చేర్పుల గురించి చర్చించినట్లు తెలిసింది. మంత్రివర్గం నుండి తొలగించవలసిన వారి పేర్లను కూడా ఖరారు చేస్తున్నారని అంటున్నారు. సమర్థంగా పని చేసే యువ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సోనియా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయటం లేదని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెలాఖరులో తిరిగి వచ్చిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తేదీని ఖరారు చేస్తారని చెబుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...