Friday, June 10, 2011

ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ

హైదరాబాద్,జూన్ 11: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ శుక్రవారం అధికారికంగా 313 జీవోను జారీ చేశారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో దామోదర రాజనర్సింహ రాష్ట్ర హోంమంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నటు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. 2007-09లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, రెండోవిడత మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాతో వ్యవసాయ శాఖమంత్రిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. దళితుడైన తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటం సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని రుజువు అయ్యిందన్నారు. తెలంగాణ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి తెలియచేస్తానని తెలిపారు. జేఏసీ డెడ్‌లైన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...